బ్యాంకింగ్ డౌన్.. ఐటీ అప్...
వరుసగా కొద్ది రోజుల నుంచి ర్యాలీ జరుపుతున్న బ్యాంకింగ్ షేర్లలో బుధవారం పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్పంగా వడ్డీ రేట్లు పెంచడం, రూపాయి మారకపు విలువ హఠాత్తుగా క్షీణించడంతో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. రెండు వారాల నుంచి స్తబ్దుగా వున్న ఐటీ షేర్లలో కొనుగోళ్లు జరిగినప్పటికీ, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన బ్లూచిప్‌లు బలహీనంగా ట్రేడ్‌కావడంతో స్టాక్ సూచీలు వారం రోజుల కనిష్టస్థాయి వద్ద ముగిసాయి.
ట్రేడింగ్ తొలిదశలో 21,000 పాయింట్లస్థాయిని బీఎస్‌ఈ సెన్సెక్స్ అధిగమించగలిగినా, తదుపరి అమ్మకాల ఒత్తిడి కారణంగా 20,861 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 80 పాయింట్ల (0.38 శాతం) నష్టంతో 20,895 పాయింట్ల వద్ద ముగిసింది. దీపావళి రోజున మూరత్ ట్రేడింగ్ సమయంలో నమోదుచేసిన 21,321 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి ఇప్పటికే సెన్సెక్స్ 425 పాయింట్ల మేర నష్టపోయింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల వెయిటేజీ ఎక్కువగా వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తాజా అమ్మకాలతో సెన్సెక్స్‌కంటే అధిక శాతం నష్టపోయింది. 38 పాయింట్ల (0.61 శాతం) క్షీణతతో 6,215 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ బుల్ ఆఫ్‌లోడింగ్....
వరుసగా రెండోరోజు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో బుల్స్ వారి లాంగ్ పొజిషన్ల ఆఫ్‌లోడింగ్ కొనసాగించారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని చేరే సూచనలు కన్పించ కపోవడంతో మార్కెట్లో ఆఫ్‌లోడింగ్ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి మరో 8.87 లక్షల షేర్లు (4 శాతం) కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.15 కోట్ల షేర్లకు తగ్గింది. 6,300 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కొనసాగడంతో తాజాగా 4.09 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. 6,200 స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్ ఫలితంగా ఈ పుట్ ఆప్షన్ నుంచి 40,000 షేర్లు కట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లలోనూ సమానంగా 38 లక్షల షేర్ల బిల్డప్ చొప్పున వుంది. సమీప భవిష్యత్తులో 6,200 దిగువన నిఫ్టీ మరింత బలహీనపడొచ్చని, 6,300 దాటితే తిరిగి ఆప్‌ట్రెండ్ మొదలుకావొచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. బుధవారం బ్యాంకింగ్ షేర్లు బాగా క్షీణించినా, బ్యాంక్ నిఫ్టీలో తాజా షార్ట్ బిల్డప్ జరిగిన సూచనలేవీ డేటాలో వెల్లడికాలేదు.