ముంబై : నిన్నటి ట్రేడింగ్ లో మూడు వారాల కనిష్టానికి పతనమైన స్టాక్ మార్కెట్లు నేటి(మంగళవారం) ట్రేడింగ్ లో కోలుకున్నాయి. సెన్సెక్స్138 పాయింట్ల లాభంలో 25,575.89 వద్ద నమోదవుతుండగా.. నిఫ్టీ 7,800 ట్రేడ్ మార్కును దాటింది. 46.10 పాయింట్ల లాభంతో 7,852 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్లో నిన్నటి వరకూ నష్టాల్లో నడిచిన బ్యాంకింగ్ షేర్లు రికవరీ అయ్యాయి. మార్కెట్ల ప్రారంభంలో హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ లాభాల బాట పటడంతో సెన్సెక్స్ 200 పాయింట్లను దాటి ట్రేడ్ అయింది. ఆటో, బ్యాంకు, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎమ్ సీజీ, రియాల్టి స్టాక్స్, నిఫ్టీని 7,800 ట్రేడ్ మార్కును దాటడానికి దోహదం చేశాయి.
మరోవైపు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 11 పైసలు బలపడి రూ.66.33గా ఉంది. ఆసియన్ కరెన్సీ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో రూపాయి బలపడిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. బంగారం, పసిడి కొంతమేర కిందకు జారాయి. పసిడి రూ. 30,267 వద్ద, వెండి రూ. 41,170 వద్ద నమోదవుతున్నాయి.