జీఎస్టీ ఊపు.. లాభాల్లో మార్కెట్లు
ముంబై : జీఎస్టీ బిల్లు ఈ మార్కెట్ సెషన్ లోనే ఆమోదం పొందుతుందనే ఊపుతో దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేడు ఈ బిల్లుపై చర్చ జరుగనున్న నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల లాభంతో 28,245 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 59.70 పాయింట్ల లాభంతో 8,698గా కొనసాగుతోంది. హీరో మోటార్ కార్పొరేషన్ దాదాపు 6శాతం ఎగిసింది. బీహెచ్ఈఎల్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎల్&టీ, ఓఎన్జీసీ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, లుపిన్ నష్టాలను చవిచూస్తున్నాయి. బలహీనమైన ఆపరేటింగ్ ఫర్ఫార్మెన్స్ ను జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఐసీఐసీఐ నమోదుచేయడంతో, ఆ బ్యాంకు షేర్లు మార్నింగ్ ట్రేడ్ లో 2శాతం మేర పడిపోయాయి.
చైనీస్ ఎకాననీ వృద్ధి , రెండో త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలకంటే పడిపోవడం మరోసారి ఫెడ్ రేట్ పెంపు ఆలస్యం కావొచ్చని సూచనలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. టెక్ మహింద్రా, టాటా కమ్యూనికేషన్, డెల్టా కార్పొరేషన్, ఇంటర్గ్లోబల్ ఏవియేషన్, వీఆర్ఎల్ లాజిస్టిక్స్ వంటి కంపెనీల జూన్ క్వార్టర్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
అటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మార్నింగ్ ట్రేడ్లో 31 పైసలు బలపడింది. ప్రస్తుతం 66.73గా కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.485 లాభంతో, 31,516 రూపాయలుగా నడుస్తోంది.