ఆ షేర్లే హాట్ కేకులు...!
పలు అనుకూల, ప్రతికూల వార్తలతో స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, మార్కెట్ ట్రెండ్ మాత్రం మారుతున్నది. ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్ల దృక్పధంలో మార్పును సూచిస్తూ గతంలో పతనమైన రంగాల షేర్లు క్రమేపీ కోలుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో ర్యాలీ జరిపిన కొద్ది షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని చవిచూస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటు తదితర కారణాలతో ఆర్థిక వ్యవస్థ ఇంకా పతనావస్థలో వున్నా, దేశ ఆర్థిక ఆరోగ్యస్థితిని ప్రతిబింబించే రంగాలకు చెందిన షేర్లు ఇటీవల పెరగడం విశేషం. ఇంకా వడ్డీ రేట్ల తగ్గుదల మొదలు కావొచ్చన్న సంకేతాలేవీ లేకపోయినా, అధిక వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించడం విశేషం.
బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ మెరుపులు...
ఏడాదికాలంగా పలు దఫాలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు 20,500, 6,000 పాయింట్లపైకి పెరగడం, 18,500, 5,400 పాయింట్ల దిగువకు తగ్గడం జరిగింది. అయితే పెరిగిన ప్రతీ సందర్భంలోనూ ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపడం, తగ్గినపుడు అధిక వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే రంగాలు క్షీణించడం జరిగిపోయేది. అయితే గత రెండు నెలలు, లేదా నెలరోజుల ట్రెండ్‌లో మార్పు జరిగినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీలో భాగంగా వున్న 50 షేర్ల హెచ్చుతగ్గుల డేటా వెల్లడిస్తున్నది. గత 365 రోజుల్లో 10 నుంచి 35 శాతం మేర క్షీణించిన ప్రధాన బ్యాంకింగ్ షేర్లు నెలరోజుల నుంచి 1-12 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. ఈ నెలరోజుల నుంచి నిఫ్టీ సూచీ కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ, మెటల్ షేరు టాటా స్టీల్ 20 శాతం పెరిగింది. ఏడాదిలో 50 శాతం పడిపోయిన రియల్టీ షేరు జేపీ అసోసియేట్స్ అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో 8 శాతం ఎగిసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నా, ఆటోమొబైల్ షేర్లు మారుతి, మహీంద్రా, టాటామోటార్స్‌కు మాత్రం ఏడాది నుంచి ప్రతీ క్షీణతలోనూ కొనుగోలు మద్దతు లభిస్తున్నది.
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ...
ఆయా కంపెనీలు మంచి ఫలితాలు వెల్లడించినా, రూపాయి మారకపు విలువ ఇంకా 63 స్థాయివద్దే వున్నా, ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగిసినా నెలరోజుల నుంచి ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు క్షీణిస్తున్నాయి. ఏడాది నుంచి ఈ షేర్లు అతిపెద్ద ర్యాలీ జరపడం వల్ల సంవత్సరాంతపు లాభాల స్వీకరణ ఈ క్షీణతకు ఒక కారణమైతే, పెట్టుబడుల ట్రెండ్ మారడం మరో కారణమని బ్రోకింగ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. 2012 నవంబర్ నుంచి 56 శాతం పెరిగిన టీసీఎస్ ఈ ఏడాది సెప్టెంబర్ ఫలితాలు వెల్లడించినప్పటి నుంచి 8 శాతం పడిపోయింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌లది కూడా ఇదే తీరు. 2013 జూలై వరకూ స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి సహకరించిన ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్‌లు నెల రోజుల నుంచి 3-7 శాతం మధ్య తగ్గాయి.
సహజంగానే రాబోయే మార్పులను స్టాక్ మార్కెట్ ముందుగా డిస్కౌంట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యలు ఒక్కటొక్కటిగా తొలగిపోవచ్చన్న అంచనాలు మార్కెట్లో మొదలువుతున్నాయని, దాంతో కొనుగోళ్ల ట్రెండ్ మారిందని ట్రేడింగ్ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు నుంచి బంగారం దిగుమతులు తగ్గడం, దేశంలోకి ఎన్నారైల రెమిటెన్సులు పెరగడం వంటి అంశాలతో వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు నాటకీయంగా తగ్గిందని, ఈ తగ్గుదల ఇలానే కొనసాగితే రూపాయి మారకపు విలువ బలపడి, ద్రవ్యోల్బణం దిగివస్తుందని, తర్వాత ఆటోమేటిక్‌గా రిజర్వుబ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తుందనేది దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల అంచనా. ఏడు నెలల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలను తీసుకొస్తుందన్న అంచనాల్ని గోల్డ్‌మాన్ శాక్స్, సీఎల్‌ఎస్‌ఏ తదితర అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు వెలువరించాయి.