సెన్సెక్స్@25,000 | BSE Sensex closes above 25,000-level for the first time | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్@25,000

Published Fri, Jun 6 2014 12:37 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

సెన్సెక్స్@25,000 - Sakshi

సెన్సెక్స్@25,000

 తొలిసారి 25,000 పాయింట్లపైన ముగింపు

 * 214 పాయింట్లు జంప్...
 *  నిఫ్టీ కూడా కొత్త క్లోజింగ్ రికార్డు...
 *  72 పాయింట్లు ఎగసి 7,474 వద్ద క్లోజ్...
  * మెటల్స్, విద్యుత్, చమురు-గ్యాస్ షేర్ల దూకుడు

 
 రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్న సెన్సెక్స్... గురువారం సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. చరిత్రలో తొలిసారిగా 25 వేల పాయింట్లకుపైన ముగియడం ద్వారా ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేసింది. దేశీ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే ముందే చాలావేగంగా పుంజుకోవచ్చన్న సంకేతాలు బలపడుతుండటం... యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించొచ్చన్న అంచనాలు దేశీ మార్కెట్లలో కొత్త జోష్ నింపాయి. ప్రధానంగా విద్యుత్, మెటల్స్. చమురు-గ్యాస్ రంగాల షేర్లు పరుగులు తీయడంతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ కూడా కొత్త శిఖరాలను చేరుకున్నాయి.
 
ముంబై: సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ఆరంభంలో సానుకూలంగానే స్వల్పలాభాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 24,806 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 24,828 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆతర్వాత ఒకానొక దశలో 24,645 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ఇక అక్కడినుంచీ క్రమంగా పుంజుకుంటూ పైపైకి ఎగబాకింది. 25,044 పాయింట్ల గరిష్టాన్ని తాకి... చివరకు దాదాపు అదేస్థాయిలో 25,020 వద్ద స్థిరపడింది.
 
అంటే 214 పాయింట్లు బలపడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలరోజున మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు బంపర్ మెజారిటీ లభించడంతో సెన్సెక్స్ తొలిసారి 25 వేల మార్కును దాటి ఇంట్రాడేలో 25,376 పాయింట్లను తాకడం తెలిసిందే. అయితే, ఆరోజు చివర్లో లాభాల స్వీకరణతో 25 పాయింట్లపైన సెన్సెక్స్ ముగియకుండా మళ్లీ కిందికి వచ్చేసింది. ఇప్పుడు రెండోసారి 25 పాయింట్లను అధిగమించి... ఆస్థాయిపైనే ముగియడంతో కొత్త ఆల్‌టైమ్ ముగింపు రికార్డుతోపాటు సిల్వర్‌జూబ్లీని పూర్తిచేసుకున్నట్లయింది.
 
ఇదిలాఉండగా... నిఫ్టీ కూడా ఎన్నికల ఫలితాల రోజున 7,500 పాయింట్లను తొలిసారి అధిగమించి 7,563ను తాకి మళ్లీ దిగువకు వచ్చేయడం విదితమే. అయితే, ఇప్పుడు నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 7,474 పాయింట్ల కొత్త ముగింపు రికార్డును నమోదు చేసింది. ఈ నెల 3న సాధించిన క్లోజింగ్ రికార్డులను సెన్సెక్స్, నిఫ్టీ రెండు గురువారం నాడు బద్దలుకొట్టాయి.
 
రిటైల్ ఇన్వెస్టర్ల జోరుతో...
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహానికి తోడు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లకు ఉత్సాహంగా ముందుకొస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతంమవుతోందని బ్రోకరేజి, ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈసీబీ సహాయ ప్యాకేజీ గనుక ప్రకటించినపక్షంలో ఆ నిధులు కూడా మన మార్కెట్లోకి కొంత రావచ్చని దీనివల్ల బుల్స్ మరింత దూకుడు పెంచే అవకాశాలున్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. ఇది కూడా మార్కెట్‌కు బూస్ట్‌గా పనిచేసింది.
 
గురువారం పొద్దుపోయాక ఈసీబీ పరపతి విధాన సమీక్ష నిర్ణయం వెలువడనుంది. మరోపక్క, కొత్త వ్యాపార ఆర్డర్లతో దేశ సేవల రంగం ఏడాది తర్వాత మళ్లీ మే నెలలో పుంజుకోవడం కూడా ఇన్వెస్టర్లకు టానిక్‌లా పనిచేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా.. ప్రీ-బడ్జెట్ సంప్రతింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శుక్రవారం కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం కానున్నారు.
 
 ఇతర ముఖ్యాంశాలివీ...
     
బీఎస్‌ఈలోని మొత్తం 12 రంగాల సూచీల్లో 11 రంగాలు లాభాలతో ముగియడం... కొనుగోళ్ల జోరుకు అద్దంపడుతోంది. మెటల్స్ సూచీ అత్యధికంగా 3.33 శాతం దూసుకెళ్లింది. ఆతర్వాత చమురు-గ్యాస్, విద్యుత్ 1.96 శాతం చొప్పున... ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.49%, ఐటీ సూచీ 1.29% చొప్పున బలపడ్డాయి.
     
స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు కొత్త 52 వారాల గరిష్టాన్ని తాయాకి. 1.42%, 1.01% చొప్పున పుంజుకున్నాయి.
     
సెన్సెక్స్ 30 స్టాక్స్ జాబితాలో 23 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక భారీగా పుంజుకున్న షేర్లలో సెసాస్టెరిలైట్ 6.5%, హిందాల్కో 5.54%, హెచ్‌యూఎల్ 4.27%, టాటా పవర్ 3.64%, టాటా స్టీల్ 3.45%, టాటా మోటార్స్ 3.11% ఉన్నాయి.  గెయిల్ 2.77%, ఓఎన్‌జీసీ 2.01%, విప్రో 1.88%, ఇన్ఫోసిస్ 1.48 శాతం చొప్పున బలపడ్డాయి.
     
సెన్సెక్స్‌లో ట్రేడయిన షేర్లలో 2,153 స్టాక్స్ లాభాల్లో ముగియగా... 869 మాత్రమే నష్టాపోయాయి.
     
ఇక బీఎస్‌ఈ నగదు విభాగంలో టర్నోవర్ క్రితం రోజుతో పోలిస్తే మెరుగుపడి రూ.4,906.75 కోట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ క్యాష్ సెగ్మెంట్‌లో రూ. 25,335 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,71,850 కోట్ల టర్నోవర్ నమోదైంది.
     
 ప్రాథమిక గణాంకాల ప్రకారం బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ.193 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపగా... గురువారం మరో రూ.1,369 కోట్ల నికర పెట్టుబడులు కుమ్మరించినట్లు తెలుస్తోంది.
 
బడ్జెట్‌కు ముందే 30,000కు..!

మార్కెట్ జోరు చూస్తుంటే... బడ్జెట్‌కు ముందే సెన్సెక్స్ 30,000 పాయింట్ల స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయప్డారు. మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చేపడుతన్న ప్రతి ఒక్క చర్యనూ ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని.. ఈజీఓఎంలను రద్దు చేయడం, 100 రోజుల ఎజెండాను నిర్ధేశించడం, నల్లధనంపై పోరుకు సిట్ ఏర్పాటు వంటి కొన్ని కీలక చర్యలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఇనుమడించిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి పేర్కొన్నారు. వ్యాపారానుకూల ఆర్థిక విధానాలను మోడీ సర్కారు అవలంభిస్తున్న అంచనాల నేపథ్యంలో ఆటంకాలు తొలగి మళ్లీ ఆర్థిక వృద్ధిరేటు గాడిలోపడుతుందన్న నమ్మకం పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement