పడగొట్టిన గణాంకాలు
ఆర్థిక వృద్ధిపట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు ఉదయం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో మంగళవారం ప్రారంభంలోనే మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి 1.9% తిరోగమన బాట(మైనస్)ని పట్టిన విషయాన్ని గడిచిన శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ గణాంకాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి జతగా అన్నట్లు మార్చి నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) 5.7%కు పెరగడంతో సెంటిమెంట్ బలహీనపడింది.
ఫలితంగా మిడ్ సెషన్‌లో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 213 పాయింట్ల వరకూ జారి 22,416 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరికి కొంతమేర కోలుకుని 144 పాయింట్ల నష్టంతో 22,737 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 43 పాయింట్లు బలహీనపడి 6,733 వద్ద ముగిసింది. మంగళవారం మార్కెట్లు ముగిశాక వెలువడనున్న రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపట్ల కూడా ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలకు దిగారని నిపుణులు పేర్కొన్నారు.
టీసీఎస్ దూకుడు
బీఎస్‌ఈలో రియల్టీ, బ్యాంకింగ్, మెటల్ రంగాలు 3-2% మధ్య నీరసించగా, అదే స్థాయిలో లాభపడ్డ ఐటీ ఇండెక్స్ మార్కెట్లను కొంతమేర ఆదుకుంది. బుధవారం ఫలితాలు ప్రకటించనున్న టీసీఎస్ 4% జంప్‌చేయగా, విప్రో సైతం 3.7% ఎగసింది. కాగా, బ్యాంకింగ్ సూచీలో అన్ని షేర్లూ డీలాపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్‌బ్యాంక్ 5.5% చొప్పున పతనంకాగా, కెనరా, ఫెడరల్, యాక్సిస్, బీవోబీ 4-3% మధ్య క్షీణించాయి. ఈ బాటలో దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ సైతం 1.5% స్థాయిలో నష్టపోయాయి. ఇక మెటల్ షేర్లు సెయిల్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, టాటా స్టీల్ 5.5-2.8% మధ్య తిరోగమించాయి. ఇతర సెన్సెక్స్ దిగ్గజాలలో భెల్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, సన్ ఫార్మా, టాటా పవర్ 2% స్థాయిలో బలహీనపడ్డాయి.
6% పడ్డ డీఎల్‌ఎఫ్
ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు ఆవిరికావడంతో రియల్టీ షేర్లు పతనమయ్యాయి. డీఎల్‌ఎఫ్ 6% దిగజారగా, అనంత్‌రాజ్, డీబీ, హెచ్‌డీఐఎల్, ఒబెరాయ్ రియల్టీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూనిటెక్ 4-2% మధ్య నష్టపోయాయి. అయితే మిడ్ క్యాప్స్‌నకు డిమాండ్ కొనసాగింది. ఫ్యూచర్ రిటైల్, గృహ్ ఫైనాన్స్, ధనలక్ష్మీ బ్యాంక్, యునెటైడ్ స్పిరిట్స్, తిలక్‌నగర్, క్లారియంట్, గుజరాత్ ఫ్లోరో, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఎస్‌ఆర్‌ఎఫ్ తదితరాలు 20-5% మధ్య దూసుకెళ్లాయి.