బ్యాంకింగ్ స్టాక్స్.. టాప్‌గన్స్!
మూడేళ్ల నుంచి భారత్ స్టాక్ మార్కెట్ ర్యాలీ జరిపినపుడల్లా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు సహకరిస్తుండగా, ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు మాత్రం బ్యాంకింగ్ షేర్లు నేతృత్వం వహిస్తున్నాయి. ఇతర రంగాల తోడ్పాటుతో స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. కానీ సూచీల్లో 30 శాతం వెయిటేజీ వున్న బ్యాంకింగ్ షేర్లు పరుగులు తీయడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ దఫా చరిత్రాత్మక గరిష్టస్థాయిని నమోదుచేయగలిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఆ రికార్డుకు కేవలం అరశాతం దూరంలో వుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఆగస్టు 28న 5,118 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన తర్వాత రెండు నెలల్లో అత్యంతవేగవంతంగా ఆ సూచీ 23 శాతం ర్యాలీ జరిపితే, ఆ ప్రధాన సూచీని తలదన్నుతూ బ్యాంక్ నిఫ్టీ 38.82 శాతం పెరిగింది.
ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల శాతం ఆందోళనకరంగా పెరగలేదన్న అంశం ఇటీవలి ఆర్థిక ఫలితాల్లో వెల్లడికావడంతో ఈ షేర్ల ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇవే భయాలతో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ బ్యాంకింగ్ షేర్లు నిలువునా పతనమయ్యాయి. కానీ ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐల నిరర్థక ఆస్తులు నామమాత్రంగానే వుండటంతో పాటు వాటి వడ్డీ ఆదాయంలో 6-10 శాతం మధ్య వృద్ధి సాధించగలిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇంకా ఎస్‌బీఐ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. అయితే ఇతర పీఎస్‌యూ బ్యాంకులు వెలువరించిన ఫలితాల్లో ఎన్‌పీఏల శాతం ప్రైవేటు బ్యాంకులంత తక్కువగా లేకపోయినా, ఇన్వెస్టర్ల అంచనాలకు కాస్త తక్కువగానే వుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌పీఏలైతే తగ్గాయి కూడా. ఈ బ్యాంకు లాభం అనూహ్యంగా రెట్టింపయ్యింది. దాంతో ఈ షేరు అక్టోబర్ 30న ఒకేరోజున 21 శాతం ర్యాలీ జరపగలిగింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్....
బ్యాంక్ నిఫ్టీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 12 బ్యాంకులుండగా, గత రెండు నెలల ర్యాలీలో అన్నింటికంటే ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరే 77.7 శాతం ఎగిసి రూ. 126 నుంచి రూ. 224 స్థాయికి చేరింది. తర్వాతి స్థానం యస్ బ్యాంక్‌ది. అయితే ప్రమోటర్ల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఇతర ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లకంటే ఎక్కువగా నష్టపోవడంతో ఈ షేరు రికవరీ (75%) అధికంగా వుంది. లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ 55% పెరగ్గా, ఐసీఐసీఐ బ్యాంక్ 49% ర్యాలీ జరిపింది.
ఈ షేర్ల ర్యాలీకి ఆర్థిక ఫలితాలు ఆశావహంగా వుండటం ఒకటే కారణం కాదని, అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ సంస్థల పోర్ట్‌ఫోలియోల్లో బ్యాంకింగ్ షేర్లు క్రమేపీ తక్కువైనందున, హఠాత్తుగా ఈ షేర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయని మార్కెట్ విశ్లేషకులు వివరిస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొండి బకాయిల శాతం బాగా పెరగవచ్చన్న అంచనాలున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ షేరు మాత్రం బ్యాంక్ నిఫ్టీకంటే వెనుకబడి వుంది. ఈ షేరు 29.88% పెరి గింది. దాదాపుగా ఆల్‌టైమ్ గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరుగుదల శాతం సహజంగానే పరిమితంగా వుంది.
కొద్ది సంవత్సరాలుగా ముఖ్య సూచీల ప్రధాన ర్యాలీలో పాలుపంచుకున్న ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఈ 8 వారాలుగా నిఫ్టీకంటే వెనుకబడ్డాయి. వీటి లాభాల వృద్ధిని ముందుగానే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నందున, ఇవి ఫలితాల వెల్లడి తర్వాత ఇన్వెస్టర్లను ఆకర్షించలేకపోయాయి.
ఈ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 7.4%, టీసీఎస్ 14.8 % చొప్పున పెరగ్గా, ఐటీసీ 15.7% ఎగిసింది. ఇక స్టాక్ సూచీల్లో 10% వెయిటేజీ వున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పెరుగుదల 18.7 శాతమే. ఈ 4 షేర్లకు కలిపి నిఫ్టీలో 37% వరకూ వెయిటేజీ వుంది. బ్యాంకింగ్ షేర్లతో పోటీపడి పెరిగిన షేరు ఇన్‌ఫ్రా రంగానికి చెందిన ఎల్‌అండ్‌టీ ఆసరాతో నిఫ్టీలో ఈ ర్యాలీ సాధ్యపడింది.