రేప్ కేసులో స్వామీజీకి మళ్లీ చుక్కెదురు
అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు మరోసారి నిరాశపడక తప్పలేదు. తనకు అనారోగ్యంగా ఉందని, అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒకవేళ ఆశారాం చికిత్స పొందాలనుకుంటే ఆయన ఎయిమ్స్‌లో లేదా జోధ్‌పూర్‌లో లేదా రాజస్థాన్ ఆయుర్వేద ఆస్పత్రిలో పొందొచ్చని, అయితే అప్పుడు కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాను ఢిల్లీలో ఆయుర్వేద చికిత్స పొందాలని, అందుకోసం నెల రోజుల మధ్యంతర బెయిల్ కావాలని ఆశారాం బాపు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే, ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉందని ఎయిమ్స్ వైద్యబోర్డు చెప్పినందున బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని బెంచి తెలిపింది. రాష్ట్రంలోని ఆస్పత్రులలో ఆశారాంకు ఏ చికిత్స కావాలన్నా చేయించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. చికిత్స అందించే సమయంలో ఆశారాం మద్దతుదారులను ఆస్పత్రిలోకి అనుమతించకూడదని, ఎవ్వరూ ఆయనను కలవకూడదని ధర్మాసనం తెలిపింది. నవంబర్ నెలలో ఆయన బెయిల్ దరఖాస్తును విచారిస్తామని చెప్పింది. 2013 ఆగస్టు 31వ తేదీన జోధ్‌పూర్ పోలీసులు ఆశారాం బాపును అరెస్టుచేశారు. ఆయన అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును ఆగస్టు 9న హైకోర్టు తిరస్కరించింది. జోధ్‌పూర్ సమీపంలోని మనాయ్ గ్రామంలో ఆశారాం బాపు తనపై అత్యాచారం చేశారని ఓ టీనేజి యువతి ఫిర్యాదుచేసింది.