
రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ: కోదండరాం
రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చిందని టి.జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం ఆరోపించారు. నాలుగు జిల్లాలతో ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని విభజించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమను విభజించడం వల్ల సీమవాసులకు మేలు జరగదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో మహాత్ముని స్మృతివనమైన రాజ్ఘాట్లో తెలంగాణ నేతలు చేపట్టిన మౌన దీక్ష ముగిసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన అనేది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే విభజించాలని ఆయన పేర్కొన్నారు. జులై 30వ తేదీన తెలంగాణపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్నే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని జాతీయ పార్టీ నేతలను కలసి రాయల తెలంగాణను వ్యతిరేకించాలని కోరతామని చెప్పారు.10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవిభజన నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కేంద్రానికి హితవు పలికారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ తీసుకురావలసిన బాధ్యత టి.కాంగ్రెస్ నేతలదే ఆయన వ్యాఖ్యానించారు. అలాకాకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రొ.కోదండరాం ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.