
మూడో రోజూ నష్టాల్లోనే
నిరాశపర్చిన ఆర్‌బీఐ నిర్ణయం
సెన్సెక్స్ 122 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు డౌన్
3 రోజుల్లో 681 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అంచనాలకు భిన్నంగా కీలక రెపో రేటును తగ్గించకుండా రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచడం మంగళవారం మార్కెట్ వర్గాలను నిరాశపర్చింది. దీంతో సెన్సెక్స్ మరో 122 పాయింట్లు కోల్పోయి 29,000 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడు రోజుల్లో ఏకంగా 682 పాయింట్లు (సుమారు 2.30 శాతం) మేర క్షీణించినట్లయింది. తాజాగా బీఎస్‌ఈలో బ్యాంకెక్స్ సూచీ అత్యధికంగా 2.61 శాతం, రియల్టీ సూచీ 1.43 శాతం తగ్గాయి. మంగళవారం ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షకు ముందు సెన్సెక్స్ 130 పాయింట్లు లాభంలోనే కొనసాగింది.
అయితే, ఆ తర్వాత పరపతి విధాన ప్రకటన తర్వాత మాత్రం నష్టాల్లోకి జారింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 0.42 శాతం క్షీణించింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, నిఫ్టీ సైతం సుమారు 41 పాయింట్లు (0.46 శాతం) తగ్గింది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిరాశాపర్చడంతో మార్కెట్ వర్గాలు ఈ విధంగా ప్రతిస్పందించినట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ పేర్కొన్నారు.