రేట్ల కోత ఆశతో... 402 పాయింట్లు జూమ్
134 పాయింట్లు లాభంతో 8,325కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ గత శుక్రవారం నాటి లాభాలనే సోమవారం కూడా కొనసాగించింది. రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు, సానుకూలంగా ఉన్న ఆసియా సంకేతాలు, సోమవారం వెల్లడైన కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. బ్యాంక్, వాహన, మెటల్ షేర్ల లాభాల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 27,507 పాయింట్ల వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు (1.63 శాతం)లాభపడి 8,325 పాయింట్ల వద్ద ముగిశాయి.
సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల గరిష్టం. కాగా, నిఫ్టీకి ఒక వారం గరిష్ట స్థాయి. చైనా వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడం, అమెరికా ఉద్యోగ గణాంకాలు సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయని ట్రేడర్లు పేర్కొన్నారు. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,719 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,383 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,05,341 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.170 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.329 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
33,000కు సెన్సెక్స్: బీఓఏ-ఎంఎల్
సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో మరిన్ని ఒడిదుడుకులు తప్పవని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) పేర్కొంది. కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిల్లో లేకపోవడం, మరిన్ని రేటింగ్‌ల కోత ఉండొచ్చని సంస్థ విశ్లేషకులు జైపురియ చెప్పారు. అయితే ఈ డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 33,000 పాయింట్లకు చేరుతుందన్న తమ అంచనాల్లో ఎలాంటి మార్పులేదన్నారు.