రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ వచ్చీరావడంతోనే విల్లు ఎక్కుపెట్టారు. ఎదురొచ్చి ఆహ్వానం పలికిన సమస్యలపై ‘రామ’ బాణాన్ని సంధించారు. దీంతో ఇటీవల మొండిబకాయిలతో నీరసించిన బ్యాంకింగ్ రంగం ఒక్కసారిగా దూకుడు ప్రదర్శించింది. అన్ని బ్యాంకింగ్ షేర్లూ లాభాలతో దూసుకెళ్లాయి. ఏకంగా 9% హైజంప్ చేసిన బ్యాంకెక్స్ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. వెరసి సెన్సెక్స్ 412 పాయింట్లు ఎగసి 18,980 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 145 పాయింట్లు పురోగమించి 5,600 చేరువలో నిలిచింది.
ఇది మూడు వారాల గరిష్టం!
రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజన్ తీసుకున్న నిర్ణయాలు అటు రూపాయి, ఇటు స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. మరిన్ని సంస్కరణలకు తెరలేపుతూ లోక్‌సభలో పెన్షన్ బిల్లు పాస్ కావడం కూడా ఇందుకు జత కలిసింది. వెరసి డాలరుతో మారకంలో రూపాయి 106 పైసలు లాభపడి 66 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 19,000 పాయింట్లకు చేరువై ముగిసింది. ఇంట్రాడేలో రూపాయి 55.5కు చేరగా, సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడి 19,117ను తాకింది.
యాక్సిస్ 16% అప్
బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాలతో కదం తొక్కాయి. యాక్సిస్ బ్యాంక్ 16% జంప్ చేయగా... దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ 9% పైగా ఎగశాయి. ఈ బాటలో యస్ బ్యాంక్ ఏకంగా 21% దూసుకెళ్లగా... ఫెడరల్ బ్యాంక్, ఓబీసీ, ఐఎన్‌జీ వైశ్యా, కొటక్, ఇండస్‌ఇండ్, బీవోబీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం 12-7% మధ్య ఎగశాయి. ఇక సెన్సెక్స్‌లోనూ భెల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ 8-4% మధ్య పుంజుకున్నాయి. అయితే సెసా గోవా 4.3% పతనమైంది. మరోవైపు రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, శోభా, డీఎల్‌ఎఫ్, ఇండియాబుల్స్, డీబీ, యూనిటెక్ 10-4% మధ్య పుంజుకోవడంతో బీఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్ 5.4% ఎగసింది.
ఐటీ ఇండెక్స్ డీలా
మార్కెట్ సెంటిమెంట్‌కు విరుద్ధంగా ఐటీ ఇండెక్స్ 3% పతనమైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ 3.5% చొప్పున నీరసించగా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, హెక్సావేర్, టెక్ మహీంద్రా 2.7-1.5% మధ్య నష్టపోయాయి. డాలర్ బలహీనపడటానికితోడు, ఇటీవల కొత్త గరిష్టాలను తాకిన ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు అమ్మకాలు నిర్వహించారని నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల అమ్మకాలకే మొగ్గుచూపుతున్న ఎఫ్‌ఐఐలు గురువారం రూ. 1,101 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 493 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
మిడ్ క్యాప్స్ ఓకే
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% చొప్పున బలపడగా, ట్రేడైన షేర్లలో 1,487 లాభపడ్డాయి. 849 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో ఫైనాన్షియల్ టెక్, ఎల్డర్ ఫార్మా 16% స్థాయిలో జంప్ చేయగా, దాల్మియా భారత్, జేపీ పవర్, ఎన్‌సీసీ, పీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఇంజనీర్స్ ఇండియా, టైటాన్ 12-7% మధ్య పురోగమించాయి. బీఎస్‌ఈలో రూ. 2,062 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో రూ.14,291 కోట్లు చొప్పున టర్నోవర్ జరిగింది.
106 పైసలు ప్లస్-66కు బలపడ్డ రూపాయి
ముంబై: యూఎస్ డాలర్లను ఆకట్టుకునే బాటలో రఘురామ్ రాజన్ ప్రకటించిన ప్రణాళికలు ఫలించాయి. దీంతో గురువారం డాలరుతో మారకంలో రూపాయి 106 పైసలు (1.58%) బలపడి 66.01 వద్ద ముగిసింది. క్రితం ముగింపు 67.07తో పోలిస్తే ఇంటర్‌బ్యాంక్ ఫారె క్స్ మార్కెట్లో 66 వద్ద లాభాలతో మొదలైంది. ఆపై గరిష్టంగా 65.55 వరకూ పుంజుకుంది. చివరికి 66 వద్ద ముగిసింది. ముందురోజు సైతం రూపాయి 56 పైసలు బలపడిన సంగతి తెలిసిందే. పరపతి విధానాలను పటిష్టపరచడంతోపాటు, వేగవంతమైన, సమ్మిళితమైన నిర్ణయాలను చేపట్టనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించడంతో ఇటు కరెన్సీతోపాటు అటు స్టాక్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి.
బంగారం భారీ పతనం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం పసిడి ధర భారీగా పడింది. ఇక్కడ స్పాట్ బులియన్ మార్కె ట్‌లో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర బుధవారంతో పోల్చితే ఒకేరోజు రూ.1,250 పడింది. రూ.30,950 వద్దకు చేరింది. ఇంత భారీ స్థాయిలో ధర పతనం ఒకే వారంలో ఇది రెండవసారి. ఆగస్టు 29న ఈ ధర పతనం రూ.1,575. ఇక ముంబై మార్కెట్‌లో మేలిమి బంగారం ధర రూ. 375 తగ్గి రూ. 31,725కు చేరింది. ఆభరణాల బంగారం ధర రూ. 380 దిగి రూ.31,560కి చేరింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లలో బలహీన ధోరణి, రూపాయి బలోపేతం, స్టాకిస్టుల లాభాల స్వీకరణ దీనికి కారణం. గురువారం కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ నెమైక్స్‌లోని కమోడిటీ డివిజన్‌లో ఔన్స్(31.1గ్రా) పసిడి ధర 22 డాలర్ల నష్టంతో 1,367 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.