
రిలయన్స్‌కు ఫలితాల కిక్
ముంబై: ఇండస్ట్రీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) దూసుకుపోతోంది. నిన్నటి త్రైమాసిక ఫలితాల ప్రకటనతో మంగళవారం నాటి మార్కెట్లో తన హవాను ప్రదర్శిస్తోంది. మార్కెట్ ఓపెనింగ్ లో 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. రిలయన్స్ షేరు 1478 వద్ద 3.5 శాతానికిపైగా లాభపడి మార్కెట్లో టాప్ లాభాలతో రారాజుగా నిలిచింది. ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లపైనా పడింది. మరోవైపు ఎనలిస్టులు కూడా ఈ షేరు బై కాల్ ఇస్తున్నారు.
సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభపడగా, నిఫ్టీ ఆల్ టైం హైని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్న సెంటిమెంటుకు తోడు రిలయన్స్, ఎంఎం లాంటి దిగ్గజాల లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే కొత్త రికార్డులను అందుకున్నాయి. నిఫ్టీ 9,279ను తాకింది. తద్వారా ఈ నెల 5న సాధించిన లైఫ్‌టైమ్ గరిష్టం 9,274 స్థాయిని నమోదు చేసింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ సైతం నిఫ్టీ బ్యాంక్ కూడా21987 వద్ద ఫ్రెష్ ఆల్ టైం హైని తాకింది. దాదాపు అన్ని రంగాలు గ్రీన్‌గా ట్రేడ్ అవుతుండటం విశేషం.
కాగా దేశంలో అత్యంత విలువైన కంపెనీ మరోసారి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.8,046 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీకి వచ్చిన లాభం రూ.7,167 కోట్లతో పోలిస్తే 12.5 శాతం వృద్ధి నమోదు చేసిన సంగతి తెలిసిందే.