అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!
అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!
Published Mon, Jan 23 2017 6:12 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
సమకాలీన ప్రపంచంలో యువత ఆలోచన రోజురోజూకు మారిపోతోంది. సంప్రదాయాలకు నో చెప్తున్న యువత స్వేచ్ఛ పేరుతో పెడదారి పడుతున్నారు. కొందరు మానసికంగా ఎదుగుదలను ప్రదర్శిస్తూ తమ జీవితాలను పూల పాన్పుగా చేసుకుంటుండగా.. మరికొందరు పూల పాన్పో.. ముళ్ల దారో తెలీని స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నూతన సంవత్సర సందర్భంగా చైనాలో ప్రస్తుతం నడుస్తున్న తంతు ఈ విషయాన్నే సూచిస్తోంది. పాతికేళ్ల ప్రాయం తర్వాత కూడా పెళ్లి పీటల వైపు చూడకుండా మరికొంత కాలం స్వేచ్ఛా జీవితాన్ని గడపాలనుకుంటున్నారు చైనా యువతులు.
పెద్దలు పెళ్లికి పట్టుబడుతుంటే ఆ సమస్యకు పరిష్కారంగా అద్దె మొగుడిని తెచ్చుకుంటున్నారు. అవును. మీరు చదివిందే నిజమే. అద్దెకు మొగుడు లేదా ప్రేమికుడిని తెచ్చుకునేందుకు చైనా అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారు. జనవరి 28న చైనా నూతన సంవత్సర వేడుకలు కావడంతో పెద్దల పెళ్లి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అద్దె బాయ్‌ఫ్రెండ్స్‌తో సొంత ఊర్లకు బయల్దేరారు. అమ్మాయిల అవసరాలకు అనుగుణంగా బాయ్‌ఫ్రెండ్‌గా నటించే వ్యక్తులను అందించే కంపెనీలు చైనాలో చాలానే ఉన్నాయి.
నకిలీ బాయ్‌ఫ్రెండ్‌ని పొందాలంటే.. యువతులు రూ. 10 వేల నుంచి 15 వేల వరకు ఖర్చు చేయాల్సివస్తోంది. పర్సనాలిటీ, విద్యార్హతలను బట్టి రేటు ఉంటుంది. అయినా వారు వెనకాడట్లేదు. అయితే మరీ ముక్కూమొహం తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తే తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసే అవకాశముంది. అబ్బాయి వివరాలు తెలుసుకోవడానికి వారు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. అందుకని అద్దెకు తీసుకున్న బాయ్‌ఫ్రెండ్‌తో ముందుగానే పరిచయం చేసుకుని కొద్దిరోజులు అవసరమైన వ్యక్తిగత విషయాలు అన్నీ చర్చించి.. ఆ తర్వాతే ఇంటికి తీసుకెళ్తున్నారట.
Advertisement
Advertisement