ట్రంప్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేశాసిన ట్రంప్.. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. రిగ్గింగ్ వ్యవహారంపై సొంతపార్టీ (రిపబ్లికన్) నేతలు మౌనంగా ఉండటాన్ని ఆక్షేపించారు.
'ఈ ఎన్నికల్లో కచ్చితంగా రిగ్గింగ్ జరుగుతోంది. వికృతరూపాన్ని సంతరిచుకున్న మీడియా, ఆ మీడియా వెనకేసుకొస్తున్న హిల్లరీ క్లింటన్, ఆమె పార్టీనే ఇందుకు బాధ్యులు. వైట్ హౌస్ కు కూడా ఈ కుట్రలో భాగం ఉంది. ఎన్నికలు జరగబోయే నవంబర్ 8న పలు పోలింగ్ స్టేషన్లలోనూ రిగ్గింగ్ జరగబోతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇది జరిగింది' అని ట్రంప్ అన్నారు. మహిళలపై ట్రంప్ కంపు వ్యాఖ్యలంటూ.. కీలక ఘట్టానికి కొద్ది రోజుల ముందు వరుసగా వీడియోలు వెలుగులోకి రావడం, తద్వారా మీడియా తనకు దక్కాల్సిన మహిళా ఓట్లను దక్కకుండా చేశాయని ట్రంప్ వాపోయారు. ట్రంప్ సహచరుడు, ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్(ఇల్లినాయిస్ గవర్నర్) మాత్రం భిన్నంగా స్పందించారు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన మైక్.. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి ట్రంప్ వాటిని అంగీకరిస్తారని అన్నారు.
రిగ్గింగ్ వ్యవహారంపై డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గత వారం చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ తప్పుపడుతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని నమ్ముతున్నట్లు హిల్లరీ చెప్పడం, ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనం కదులుతారని, తద్వారా ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుందని ఆమె వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ అవకాశాలను బట్టే హిల్లరీ అలా మాట్లాడి ఉండొచ్చని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. చివరిసారి అంటే 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 57.5 శాతం ఓటింగ్ నమోదయింది. అదే 2008లో ఓటింగ్ శాతం 62.3గా ఉంది. మొదటిసారి ఒక నల్లజాతీయుడైన ఒబామా అధ్యక్ష రేసులో ఉన్నందున ఓటింగ్ శాతం అమాంతం పెరిగింది. బుష్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన ఎన్నికల్లో(2004లో) 60.4 శాతం, 2000 సంవత్సరంలో 54.2 శాతం ఓటింగ్ నమోదయింది. మునుపెన్నడూలేని విధంగా విత పోకడలున్న 2016 ఎన్నికల్లో ప్రజలు ఏమేరకు ఓటింగ్ లో పాల్గొంటారో మరో 20 రోజుల్లో తేలిపోనుంది.