న్యూట్రినోలపై పరిశోధనకు నోబెల్
జపాన్ శాస్త్రవేత్త తకాకీ, కెనడా శాస్త్రవేత్త మెక్‌డొనాల్డ్‌లకు ఫిజిక్స్ బహుమతి
♦ న్యూట్రినోలు ‘రూపం’ మార్చుకుంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు
♦ తద్వారా వాటికి ద్రవ్యరాశి ఉంటుందని నిర్ధారణ
స్టాక్‌హోమ్: పరమాణువుల్లోని న్యూట్రినోలు ఊసరవెల్లి తరహాలో పరిస్థితిని బట్టి వాటి ‘రూపం’ మార్చుకుంటాయని గుర్తించిన జపా న్ శాస్త్రవేత్త తకాకీ కజిత, కెనడా శాస్త్రవేత్త ఆర్థర్ మెక్‌డొనాల్డ్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది భౌ తిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వీరి పరిశోధన వల్ల పరమాణువుల్లోని న్యూట్రినోల వంటి అతిసూక్ష్మమైన కణాలకు కూడా ద్రవ్యరాశి ఉంటుందని వెల్లడైందని... దీంతో విశ్వానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు జవాబులు లభిస్తాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. తకాకీ(56) జపాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఫర్ కాస్మిక్ రే రీసెర్చ్ సంస్థకు డెరైక్టర్‌గా, టోక్యో వర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మెక్‌డొనాల్డ్(72) కెనడాలో క్వీన్స్ వర్సిటీలో గౌరవ ప్రొఫెసర్. వీరికి నోబెల్ పురస్కారం కింద బంగారు పతకంతో పాటు చెరో రూ. 3.13 కోట్లు డిసెంబర్‌లో అందజేస్తారు.
అదృశ్య కణం.. ఊసరవెల్లి
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా అణుశక్తి సంబంధిత చర్యల్లో న్యూట్రినోలు విడుదల అవుతాయి. అంటే సూర్యుడు, నక్షత్రాల్లో కేంద్రక సంలీనం, అణురియాక్టర్లలో కేంద్రక విచ్ఛిత్తి వంటి చర్యల్లో ఇవి విడుదలవుతాయి. ఇవి కంటికి కనిపించవు. వీటిల్లో మూడు రకాల న్యూట్రినోలు ఉంటాయి. దాదాపు కాంతి వేగం తో ప్రయాణించే వీటికి ద్రవ్యరాశి ఉండదని తొలుత భావించేవారు. ఈ న్యూట్రినోలు ఒక రకం నుంచి మరో రకం న్యూట్రినోలుగా తమ ‘రూపం’ మార్చుకుంటాయని తకాకీ, మెక్‌డొనాల్డ్ గుర్తించారు. తకాకీ 1998లోనే జపాన్‌లోని కమియోకే పర్వతం అడుగుభాగంలో 2,100 మీటర్ల లోతులో ‘సూపర్-కమియోకండే డిటెక్టర్’ సహాయంతో ప్రయోగం చేశారు.
ఖగోళం నుంచి దూసుకొచ్చే న్యూట్రినోలు ఇక్కడ ఏర్పాటు చేసిన అతిసూక్ష్మ పరికరాలను తాకి చిన్నచిన్న కణాలుగా విచ్ఛిన్నమవుతాయి. ఈ క్రమంలో అవి వెలువరించే సంకేతాలను గుర్తించి న్యూట్రినో ధర్మాలను గుర్తిం చారు. న్యూట్రినోలు ‘రూపం’ మార్చుకుంటున్నాయని తకాకీ గుర్తించారు. మూడేళ్ల అనంతరం ఇదే అంశంపై పరిశోధన చేసిన మెక్‌డొనాల్డ్ సూర్యుడి నుంచి వెలువడే న్యూట్రినోలూ ‘రూపం’ మార్చుకుంటున్నట్లు, తద్వా రా న్యూట్రినోలకూ ద్రవ్యరాశి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఈ న్యూట్రినోల ద్రవ్యరాశి ఎంతనేది ఇంకావెల్లడి కాలేదు.