చాణుక్యలో మళ్లీ సినిమాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీవాసులు మళ్లీ ‘చాణుక్య సినిమా’లో సినిమాలు చూడొచ్చు. ఏడు సంవత్సరాల తరువాత చాణుక్య సినిమాను నాలుగంతస్తుల మాల్, మల్టీప్లెక్స్ రూపంలో నగరవాసులకు అందుబాటులోకి తేవడానికి ఎన్‌డీఎంసీ సన్నాహాలు చేస్తోంది. చాణుక్య సినిమాలో వచ్చే ఏడాది మార్చి నుంచి మళ్లీ సినిమాలు ప్రదర్శించవచ్చు.
ఎన్‌డీఎంసీ చాణుక్య సినిమాను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించి నాలుగంతస్తుల మాల్, మల్టీప్లెక్స్ నిర్మించే కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ నిర్మాణ సంస్థకు చాణుక్య కాంప్లెక్స్‌ను 30 సంవత్సరాల లీజుకు ఇస్తూ ఎన్‌డీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు బదులుగా కంపెనీ ఎన్‌డీఎంసీకి 85 కోట్ల రూపాయలు ఇవ్వడంతోపాటు ప్రతి నెల కోటి రూపాయలు సర్వీస్ టాక్స్ కింద చెల్లించనుంది.
మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణం 2008లో ప్రారంభమైంది. కానీ ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, డిడిఏ వంటి విభాగాలు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో నిర్మాణం జాప్యమైంది.