chanakya cinema
-
ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం
‘‘చాణక్య’ సినిమా చాలా బాగా వచ్చింది. తొలిసారి గూఢచారి పాత్ర చేశా. ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలు, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాం’’ అన్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు. ► తిరు చెప్పిన ‘చాణక్య’ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందనే ఎగై్జట్‌మెంట్‌తో పాటు టెన్షన్ ఉంటుంది. ఇందులో ఎంటర్టైనింగ్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. మాస్, క్లాస్.. ఏ జోనర్ అయినా యాక్షన్ కామనే. ఇందులో మంచి యాక్షన్ ఉంది. మంచి సినిమా తీశామని యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ► ఈ సినిమాలో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామేన్ వెట్రి పళనిస్వామి నన్ను చాలా అందంగా చూపించారు. మంచి విజువల్స్ ఇచ్చారు. ‘గౌతమ్ నంద’లో గెడ్డంతో కనిపించినా, ‘చాణక్య’లో మాత్రం వేరే స్టైల్ గెడ్డంతో ఉంటా. సరదాగా నేను గెడ్డం పెంచాను. ఈ లుక్ చాలా బాగుందని తిరు చెప్పడంతో అదే కంటిన్యూ చేశాను. స్పై ఏజెంట్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో కథ ఉంటుంది. గతంలో వచ్చిన గూఢచారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు అర్జున్. రెండు షేడ్స్ ఉంటాయి. ► మాకు బాగా దగ్గరైన వారికి ‘చాణక్య’ ప్రివ్యూ వేశాం. వారంతా సినిమా చాలా బాగుందన్నారు. సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి కూడా ఇదే మాట వస్తుందనే నమ్మకం ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాని నా ఫ్రెండ్ ప్రభాస్ చూడలేదు. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ► ‘చాణక్య’ సినిమాని మేలో విడుదల చేయాలనుకున్నాం. అయితే చివరి రోజు షూటింగ్లో బైక్ స్కిట్ అవడంతో నాకు బాగా గాయాలయ్యాయి. దాంతో షూటింగ్ ఆగిపోయి, విడుదలకు మూడు నెలలు ఆలస్యం అయింది. ‘సైరా’ ప్యాన్ ఇండియన్ సినిమానే. అయితే దసరా పండగ సమయం కావడంతో రెండు మూడు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మా చిత్రం కూడా విడుదల చేస్తున్నాం. ► నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే సెట్స్‌లో త్వరగా ఎవరితోనూ మాట్లాడను. అది హీరోయిన్ అయినా? ఎవరైనా సరే. మన కెరీర్లో ఏ సినిమా ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. మా వరకూ కష్టపడి మంచి సినిమా చేస్తాం. విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. అయితే నా కెరీర్‌కి ‘చాణక్య’ సినిమా ప్లస్ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ► మా సినిమాకి నేపథ్య సంగీతం వెన్నెముకలాంటిది. చక్కగా కుదిరింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌లోని డైలాగులకు మంచి స్పందన వస్తోంది. సినిమాలోనూ చాలా మంచి డైలాగులున్నాయి. నా కెరీర్లో చాలా మంది తమిళ డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. నాకు కథ ముఖ్యం.. భాష కాదు. డైరెక్టర్ తిరు మంచి ప్రతిభావంతుడు. తెలుగు నుంచి వెళ్లి తమిళ్లో సెటిల్ అయ్యాడు. తనతో పని చేయడం సౌకర్యంగానే అనిపించింది. అనిల్ సుంకరగారు ప్యాషనేట్ నిర్మాత. ప్రేక్షకులకు ఇంకా బాగా ఏం ఇవ్వగలం? అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారాయన. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ► మీరు ప్యాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్నకు గోపీచంద్ బదులిస్తూ.. ‘తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఈ మధ్యే గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా ఇది చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు చేద్దాం (నవ్వుతూ)’ అన్నారు. ప్రస్తుతం బిను సుబ్ర మణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాకే సంపత్ నంది సినిమా మొదలవుతుంది. ఈ రెండూ మంచి కథలే. -
ఆ సినిమాతో పోలిక లేదు
‘‘మాది ఆంధ్ర–తమిళనాడు బోర్డర్లోని ఓ గ్రామం. మాకు చిత్తూరు కేవలం 29 కిలోమీటర్లు. దీంతో చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూశాను’’ అని దర్శకుడు తిరు అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరు మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ శివ, నేను ఓ తమిళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశాం. శివ దర్శకత్వం వహించిన ‘శౌర్యం’ చిత్రం నుంచి గోపీగారితో నాకు పరిచయం ఉంది. ‘శౌర్యం’ టైమ్‌లోనే గోపీగారితో ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలనుకున్నాను. ‘చాణక్య’ కథ ఆయనకు నచ్చడంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలపై పరిశోధన చేసి కథ రాసుకున్నా. ఓ రకంగా ఈ సినిమా చేయడానికి రవీంద్ర అనే ఒక స్పై నాకు స్ఫూర్తి. వాస్తవికతకు దగ్గరగా, వాణిజ్య అంశాలు మిస్ కాకుండా తెరకెక్కించాను. రా ఏజెంట్ చూసినా సంతప్తి పడేలా ఈ చిత్రం ఉంటుంది. మా సినిమాని సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’ చిత్రంతో పోల్చుతున్నారు. నిజానికి ఇది కొత్త కథ, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా చివరి రోజు ఫైట్ సన్నివేశంలో గోపీగారికి పెద్ద గాయం అయినా చాలా ధైర్యంగా ఉన్నారు. నిర్మాతలు, నేను ఈ చిత్రం విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ, ‘చాణక్య’ రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచిస్తా’ అన్నారు. -
జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది
‘‘లైఫ్ అంటేనే స్ట్రగుల్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్ట్రగుల్ ఉంటుంది. నా లైఫ్‌లో కూడా. ప్రతి రోజూ మన జీవితం మనకు ఎంతో కొంత నేర్పుతుంది. మనకు మనం నిజాయతీగా ఉండటం ముఖ్యం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు నా దృష్టిలో సరైనవే. కానీ అన్నిసార్లు మన నిర్ణయాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాంటి అనుభవాలను లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటాను’’ అన్నారు మెహరీన్. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్ కథానాయికలుగా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన సంగతులు. ►తెలుగులో ‘చాణక్య’ నా 11వ సినిమా. ఈ సినిమాలో నేను ఐశ్యర్య అనే పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలీ, సునీల్, రఘుబాబు గార్లతో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇది స్పై థ్రిల్లర్. నా క్యారెక్టర్లో ట్విస్ట్‌లు ఉండవు. కానీ హీరో క్యారెక్టర్లో ఉన్న ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. హీరో క్యారెక్టర్‌కు ఐశ్వర్య ఎలాంటి సహాయం చేసిందనే అంశాలు సినిమాలో ఆసక్తికరం. ఐశ్వర్య పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేదు. భవిష్యత్‌లో తప్పక ప్రయత్నిస్తాను. ►ఒక ఆర్టిస్టుగా ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాను. ఐశ్వర్య పాత్ర నా కెరీర్‌కి ఎంత ఉపయోగపడుతుంది? అనే విషయం నేను ఇప్పుడే చెప్పలేను. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నా బాధ్యత. ‘మహాలక్ష్మి (కృష్ణగాడి వీరప్రేమ గాథ’), హనీ (‘ఎఫ్ 2’) పాత్రలకు ఎలా కష్టపడ్డానో ఐశ్వర్య పాత్రకు అంతే కష్టపడ్డాను. ► స్పై థ్రిల్లర్స్ తీయడం అంత ఈజీ కాదు. తిరుగారు చాలా క్లారిటీ ఉన్న దర్శకులు. ఎలాంటి షాట్స్ కావాలో అవే తీసుకున్నారు. ‘పంతం’ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘చాణక్య’ సినిమాలో గోపీచంద్‌గారితో కలిసి నటించాను. మంచి కో–స్టార్. గోపీగారు తన పని తాను చూసుకుంటారు. ఓర్పు చాలా ఎక్కువ. నిర్మాతలు అనిల్ సుంకర, గోపీ, రామ్గార్లు నన్ను ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనిల్‌గారు నేను ఎప్పుడు కనిపించినా మహాలక్ష్మీ అని పిలుస్తారు. అనిల్‌గారి బ్యానర్లో ‘చాణక్య’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ►స్క్రిప్ట్ తెలిసినప్పుడు అందులో మనల్ని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆ పాత్రలో మనకి మనం నచ్చకపోతే ఆడియన్స్‌కు కూడా నచ్చకపోవచ్చు. అందుకే నాకు సంతృప్తినిచ్చే పాత్రలే చేయాలనుకుంటాను. నా తమ్ముడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. నాకూ ఆసక్తి ఉంది. కానీ మంచి స్క్రిప్ట్ కుదరాలి. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలే చేశాను. యాక్షన్ సినిమాలు చేయడం కూడా ఇష్టమే. అయితే మంచి కథ కుదరాలి. ►ప్రత్యేకంగా డ్రీమ్ రోల్ అనేది లేవు. అనుష్కగారు ‘అరుంథతి, బాహుబలి’, సమంతగారు ‘రంగస్థలం, ఓ బేబి’, కీర్తీ సురేష్ ‘మహానటి’ సినిమాల్లో అద్భుతంగా నటించారు. అలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయడం ఇష్టం. ►నా మాతృభాష పంజాబీ. కానీ తెలుగు పరిశ్రమను నేను అమ్మలా భావిస్తాను. తెలుగు సినిమాలకే నా తొలిæప్రాధాన్యం. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌గారితో ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్యతో ‘అశ్వత్థామ’ చిత్రాలతో పాటు తమిళంలో ధనుష్గారితో ‘పటాస్’ సినిమాలో నటిస్తున్నాను. ఈ ఏడాది పంజాబీలో రెండు సినిమాలు చేశాను. ఒకటి రిలీజైంది. మరొకటి రిలీజ్ కావాల్సి ఉంది. కన్నడలో ఓ సినిమా చేయాల్సింది. కానీ చేతిలో ఎక్కవ సినిమాలు ఉండటంతో చేస్తున్న పాత్రలపై ఫోకస్ తగ్గుతుందని భావించి ఆ సినిమా ఒప్పుకోలేదు. మరో రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. -
‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’
యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్‌కు.. సరైన హిట్ తగిలి చాలా కాలమైంది. చివరగా పంతం సినిమాతో పలకరించినా.. హిట్ కొట్టాలనే పంతాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ‘చాణక్య’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ నెలకొనగా.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేశారు. సీక్రెట్ రా ఏజెంట్, బ్యాంక్ ఉద్యోగిగా డిఫరెంట్ షేడ్స్‌లో నటించిన గోపిచంద్.. మరోసారి యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
డేట్ ఫిక్స్
వెండితెరపై ‘చాణక్య’గా తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మించారు. అజయ్ సుంకర సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 5న విడుదల చేయబోతున్నామని శనివారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరామన్: వెట్రి పళనీ స్వామి. -
నేనొస్తున్నా
‘‘సార్ మనం (గూఢచారులు) రెండు లైఫ్‌లు లీడ్ చేస్తుంటాం. ఒకటి అబద్ధం. రెండోది నిజం’. ‘నా పేరు అర్జున్, ఐయామ్ యాన్ ఇండియన్’. ‘నీ గుండెల్లో దమ్ముంటే అక్కడే ఆగు బే, నేను వస్తున్నా’’ అంటూ పవర్ఫుల్ స్పైగా ‘చాణక్య’ సినిమాలో డైలాగ్స్ చెబుతున్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీనా ఖాన్ హీరోయిన్లు. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్ సోమవారం విడుదలయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు కెమెరా: వెట్రి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
ఫారిన్లో స్టెప్పులు
‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా తన తెలివితేటలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశాడు చాణక్య. ఈ జోష్‌లో ప్రేయసితో కలిసి ఫారిన్లో స్టెప్పులేస్తున్నారు. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ సుంకర సహనిర్మాత. ఈ సినిమాలో గోపీచంద్ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీ, మిలాన్‌లోని అందమైన పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పాటలను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి మారన్. -
చాణుక్యలో మళ్లీ సినిమాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీవాసులు మళ్లీ ‘చాణుక్య సినిమా’లో సినిమాలు చూడొచ్చు. ఏడు సంవత్సరాల తరువాత చాణుక్య సినిమాను నాలుగంతస్తుల మాల్, మల్టీప్లెక్స్ రూపంలో నగరవాసులకు అందుబాటులోకి తేవడానికి ఎన్డీఎంసీ సన్నాహాలు చేస్తోంది. చాణుక్య సినిమాలో వచ్చే ఏడాది మార్చి నుంచి మళ్లీ సినిమాలు ప్రదర్శించవచ్చు. ఎన్డీఎంసీ చాణుక్య సినిమాను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించి నాలుగంతస్తుల మాల్, మల్టీప్లెక్స్ నిర్మించే కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ నిర్మాణ సంస్థకు చాణుక్య కాంప్లెక్స్‌ను 30 సంవత్సరాల లీజుకు ఇస్తూ ఎన్డీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు బదులుగా కంపెనీ ఎన్డీఎంసీకి 85 కోట్ల రూపాయలు ఇవ్వడంతోపాటు ప్రతి నెల కోటి రూపాయలు సర్వీస్ టాక్స్ కింద చెల్లించనుంది. మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణం 2008లో ప్రారంభమైంది. కానీ ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, డిడిఏ వంటి విభాగాలు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో నిర్మాణం జాప్యమైంది.