జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది | Mehreen And Gopichand in Chanakya New Movie | Sakshi
Sakshi News home page

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది

Published Sat, Sep 28 2019 1:29 AM | Last Updated on Sat, Sep 28 2019 1:29 AM

Mehreen And Gopichand in Chanakya New Movie - Sakshi

‘‘లైఫ్‌ అంటేనే స్ట్రగుల్‌. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్ట్రగుల్‌ ఉంటుంది. నా లైఫ్‌లో కూడా. ప్రతి రోజూ మన జీవితం మనకు ఎంతో కొంత నేర్పుతుంది. మనకు మనం నిజాయతీగా ఉండటం ముఖ్యం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు నా దృష్టిలో సరైనవే. కానీ అన్నిసార్లు మన నిర్ణయాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాంటి అనుభవాలను లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటాను’’ అన్నారు మెహరీన్‌. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్‌ కథానాయికలుగా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్‌ చెప్పిన సంగతులు.

►తెలుగులో ‘చాణక్య’ నా 11వ సినిమా. ఈ సినిమాలో నేను ఐశ్యర్య అనే పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అలీ, సునీల్, రఘుబాబు గార్లతో మంచి కామెడీ సీన్స్‌ ఉన్నాయి. ఇది స్పై థ్రిల్లర్‌. నా క్యారెక్టర్‌లో ట్విస్ట్‌లు ఉండవు. కానీ హీరో క్యారెక్టర్‌లో ఉన్న ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. హీరో క్యారెక్టర్‌కు ఐశ్వర్య ఎలాంటి సహాయం చేసిందనే అంశాలు సినిమాలో ఆసక్తికరం. ఐశ్వర్య పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పుకోలేదు. భవిష్యత్‌లో తప్పక ప్రయత్నిస్తాను.

►ఒక ఆర్టిస్టుగా ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాను. ఐశ్వర్య పాత్ర నా కెరీర్‌కి ఎంత ఉపయోగపడుతుంది? అనే విషయం నేను ఇప్పుడే చెప్పలేను. ఆడియన్స్‌ డిసైడ్‌ చేస్తారు. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నా బాధ్యత. ‘మహాలక్ష్మి (కృష్ణగాడి వీరప్రేమ గాథ’), హనీ (‘ఎఫ్‌ 2’) పాత్రలకు ఎలా కష్టపడ్డానో ఐశ్వర్య పాత్రకు అంతే కష్టపడ్డాను.

► స్పై థ్రిల్లర్స్‌ తీయడం అంత ఈజీ కాదు. తిరుగారు చాలా క్లారిటీ ఉన్న దర్శకులు. ఎలాంటి షాట్స్‌ కావాలో అవే తీసుకున్నారు. ‘పంతం’ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘చాణక్య’ సినిమాలో గోపీచంద్‌గారితో కలిసి నటించాను. మంచి కో–స్టార్‌. గోపీగారు తన పని తాను చూసుకుంటారు. ఓర్పు చాలా ఎక్కువ. నిర్మాతలు అనిల్‌ సుంకర, గోపీ, రామ్‌గార్లు నన్ను ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనిల్‌గారు నేను ఎప్పుడు కనిపించినా మహాలక్ష్మీ అని పిలుస్తారు. అనిల్‌గారి బ్యానర్‌లో ‘చాణక్య’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది.

►స్క్రిప్ట్‌ తెలిసినప్పుడు అందులో మనల్ని మనం విజువలైజ్‌ చేసుకోవాలి. ఆ పాత్రలో మనకి మనం నచ్చకపోతే ఆడియన్స్‌కు కూడా నచ్చకపోవచ్చు. అందుకే నాకు సంతృప్తినిచ్చే పాత్రలే చేయాలనుకుంటాను. నా తమ్ముడు ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. నాకూ ఆసక్తి ఉంది. కానీ మంచి స్క్రిప్ట్‌ కుదరాలి. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ సినిమాలే చేశాను. యాక్షన్‌ సినిమాలు చేయడం కూడా ఇష్టమే. అయితే మంచి కథ కుదరాలి.

►ప్రత్యేకంగా డ్రీమ్‌ రోల్‌ అనేది లేవు. అనుష్కగారు ‘అరుంథతి, బాహుబలి’, సమంతగారు ‘రంగస్థలం, ఓ బేబి’, కీర్తీ సురేష్‌ ‘మహానటి’ సినిమాల్లో అద్భుతంగా నటించారు. అలాంటి చాలెంజింగ్‌ రోల్స్‌ చేయడం ఇష్టం.

►నా మాతృభాష పంజాబీ. కానీ తెలుగు పరిశ్రమను నేను అమ్మలా భావిస్తాను. తెలుగు సినిమాలకే నా తొలిæప్రాధాన్యం. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌గారితో ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్యతో ‘అశ్వత్థామ’ చిత్రాలతో పాటు తమిళంలో ధనుష్‌గారితో ‘పటాస్‌’ సినిమాలో నటిస్తున్నాను. ఈ ఏడాది పంజాబీలో రెండు సినిమాలు చేశాను. ఒకటి రిలీజైంది. మరొకటి రిలీజ్‌ కావాల్సి ఉంది. కన్నడలో ఓ సినిమా చేయాల్సింది. కానీ చేతిలో ఎక్కవ సినిమాలు ఉండటంతో చేస్తున్న పాత్రలపై ఫోకస్‌ తగ్గుతుందని భావించి ఆ సినిమా ఒప్పుకోలేదు. మరో రెండు స్క్రిప్ట్స్‌ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement