సస్పెన్షన్‌పై న్యాయపోరాటం
హైకోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా న్యాయ పోరాటం ప్రారంభించారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ్యురాలిగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారన్నారు.
అసెంబ్లీ బిజనెస్ రూల్స్‌కు విరుద్ధంగా తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఆయన అనుసరించిన విధానం రాజ్యాంగ విరుద్ధమని, తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం వల్ల తాను మార్చి 1 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు.
నా వాదన విన్పించే అవకాశమే ఇవ్వలేదు
‘గత ఏడాది డిసెంబర్ 17 నుంచి జరిగిన అసెంబ్లీ సెషన్‌లో జరిగిన అనేక చర్చలతో పాటు కాల్ మనీ సెక్స్ కుంభకోణంపై కూడా చర్చ జరిగింది. ఈ కేసులో నిందితులకు, అధికార పార్టీకి మధ్య ఉన్న అనుబంధంపై నేను పలు ప్రశ్నలు సంధించా. అయితే అధికార పార్టీ సభ్యులు నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే నా సస్పెన్షన్‌కు తీర్మానం చేయాలని వారికి సూచించారు.
వారు తీర్మానం ప్రవేశపెట్టడం, దానిని స్పీకర్ ఆమోదించి నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ సస్పెన్షన్ కాపీని నాకు ఇవ్వలేదు. అసలు సస్పెన్షన్‌కు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు..’ అని రోజా వివరించారు. ‘నేను అసభ్య పదజాలం వాడానని, తద్వారా శాసనసభ గౌరవాన్ని దిగజార్చానని సస్పెన్షన్‌పై చర్చ సందర్భంగా చెప్పారు. నా వాదన వినిపించే అవకాశం మాత్రం ఇవ్వలేదు.
అసెంబ్లీలో నా ప్రవర్తనపై అభ్యంతరం ఉంటే ఆ ఒక్క సెషన్‌కే సస్పెండ్ చేయాలి తప్ప, ఏడాది పాటు సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధం..’ అని రోజా తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ చర్యలు న్యాయసమీక్ష లోబడి ఉంటాయని తెలియజేస్తూ.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిన తన సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.