ఎగుమతి బియ్యాన్నీ వదలని ‘ముడుపు’ దయ్యం | Rice Millers unpaid VAT | Sakshi
Sakshi News home page

ఎగుమతి బియ్యాన్నీ వదలని ‘ముడుపు’ దయ్యం

Published Fri, Jan 29 2016 4:33 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

ఎగుమతి బియ్యాన్నీ వదలని ‘ముడుపు’ దయ్యం - Sakshi

ఎగుమతి బియ్యాన్నీ వదలని ‘ముడుపు’ దయ్యం

ఐదేళ్లుగా వ్యాట్ చెల్లించని మిల్లర్లు
* రూ.1300 కోట్లకు పైగా బకాయిలు
* బకాయిలు మాఫీ చేయించాలని ఇద్దరు మంత్రులకు మిల్లర్ల మొర!
* రూ.200 కోట్లు ముడుపులిస్తేనే మాఫీ అంటూ చినబాబు షరతు
* ‘డీల్’ కుదిర్చిన మంత్రులు

 
సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి పది రూపాయలు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోవైపు వ్యాట్ రూపంలో మిల్లర్లు బకాయిపడిన రూ.1300 కోట్లను మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారవర్గాలు చెబుతోండటం గమనార్హం. రాష్ట్రంలో ఉత్పత్తయిన బియ్యంపై ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఐదు శాతం పన్నుగా వసూలు చేస్తోంది.

భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), పౌర సరఫరాల సంస్థ(సివిల్ సప్లయిస్ కార్పొరేషన్)లకు సీఎమ్మార్(కస్టమ్ మిల్లింగ్ బియ్యం) రూపంలో అందించే బియ్యంపై కూడా ఐదు శాతం వ్యాట్‌ను వసూలు చేస్తోంది. కానీ.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే బియ్యంపై (దిగుమతి చేసుకున్న వారి నుంచి సి-ఫారం తీసుకుని వాణిజ్య పన్నుల శాఖకు అందిస్తేనే) మాత్రం వ్యాట్ రూపంలో రెండు శాతం పన్నును వసూలు చేస్తున్నారు. ఏపీ వ్యాట్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే 2005 నుంచి ఇదే పన్నుల విధానం అమల్లో ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన మిల్లర్లు ఏటా భారీ ఎత్తున బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కానీ.. వ్యాట్‌ను చెల్లించడం లేదు. ‘సీ-ఫారం’లను వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించడంలోనూ అదే వైఖరిని అనుసరిస్తున్నారు. దాంతో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. 2011 నుంచి 2015 వరకూ రూ.1300 కోట్ల మేర వ్యాట్ రూపంలో మిల్లర్లు బకాయిపడ్డారు.
 
కొరడా ఝుళిపించిన వాణిజ్యాధికారులు
ఐదేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మిల్లర్లకు ఆర్నెళ్ల క్రితం నోటీసులిచ్చారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన బియ్యానికి సీ-ఫారంలు సమర్పించని నేపథ్యంలో.. ఆ బియ్యానికి కూడా ఐదు శాతం వ్యాట్‌ను చెల్లించాల్సిందేనన్నారు. దీంతో మిల్లర్లు గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక మంత్రులను ఆశ్రయించారు.

కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బియ్యంపై పన్నులు విధించడం లేదని ఇక్కడా వ్యాట్‌ను రద్దు చేయాలని కోరారు. పనిలో పనిగా రూ.1300 కోట్ల బకాయిలను మాఫీ చేయించాలని ప్రతిపాదించారు. దీనితో ఏకీభవించిన మంత్రులు  మాఫీకి హామీ ఇచ్చారు. మిల్లర్లు బకాయిపడిన రూ.1300 కోట్ల మాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారికి పంపేలా చక్రం తిప్పారు. ఆ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. ఆ అధికారి వారి ప్రతిపాదనను తోసిపుచ్చారు. రెండోసారి కూడా ఆ మంత్రుల ప్రతిపాదనను తిరస్కరించారు.
 
రంగంలోకి దిగిన చినబాబు..
వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి అడ్డం తిరగడంతో పక్షం రోజుల క్రితం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. మిల్లర్ల బకాయిల మాఫీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆ సమావేశం తర్వాత మిల్లర్ల బకాయిల మాఫీ అంశంపై చర్చించే బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడులకు సీఎం అప్పగించారు.

బకాయిలు ఏ మేరకు చెల్లించడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారో వారినే విచారించి నివేదిక ఇవ్వాలని ఆ మంత్రులకు సీఎం ఆదేశించినట్లు వాణిజ్య శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బియ్యంపై వ్యాట్ విధించడం లేదని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ వ్యాట్ బకాయిలను రద్దు చేశారని.. ఇప్పుడూ అదే రీతిలో రద్దు చేయాలని మంత్రులపై మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చినబాబు రంగంలోకి దిగారు. రూ.200 కోట్లు ముడుపులుగా ఇస్తే మిల్లర్ల వ్యాట్ బకాయిలు మాఫీ చేస్తామంటూ మంత్రులతో ప్రతిపాదించారు.

ఇదే ప్రతిపాదనను మంత్రులు మిల్లర్ల ముందు ఉంచారు. బకాయిల రద్దుతోపాటు ఇకపై ఎగుమతి చేసే బియ్యంపై వ్యాట్‌ను రద్దు చేస్తే ఆ మేరకు ముడుపులు ఇవ్వడానికి సిద్ధమంటూ మిల్లర్లు షరతు విధించినట్లు సమాచారం. మిల్లర్ల సూచనల మేరకు చినబాబు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ నివేదికపై సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని వాణిజ్య పన్నుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో రూ.1300 కోట్ల వ్యాట్ బకాయిల మాఫీ ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement