కొడుకు సినిమా ప్లాప్: డైరెక్టర్‌పై నటుడి ఫైర్
తన కొడుకు రణ్‌బీర్ కపూర్ తాజా సినిమా 'జగ్గాజాసూస్' అట్టర్‌ప్లాప్ కావడంతో దర్శకుడు అనురాగ్ బసుపై రిషీకపూర్ ఫైర్ అయ్యారు. అనురాగ్ బసుకు బాధ్యతారాహిత్యం ఎక్కువ అని, అతను సినిమాను అనుకున్న సమయానికల్లా విడుదల చేయలేకపోయాడని విరుచుకుపడ్డారు. సంగీత దర్శకుడు ప్రీతంపై కూడా ఆయన మండిపడ్డారు. ఆయన సరిగ్గా మ్యూజిక్ అందించలేదని విమర్శించారు.
రణ్‌బీర్ కపూర్-కత్రినాకైఫ్ జోడీగా బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'జగ్గాజాసూస్' పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని సంగతి తెలిసిందే. రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలివారాంతానికి రూ. 45 కోట్లు వసూలు చేసింది. రెండోవారాంతానికి ఈ సినిమా వసూళ్లు గణనీయంగా 85శాతం తగ్గిపోయి.. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు రిషీకపూర్ 'మిడ్-డే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బసును చెడామడా వాయించేశారు.
'పోయిన బుధవారం వరకు కూడా సినిమాను మిక్సింగ్ చేస్తూ అనురాగ్ బసు గడిపాడు. మీరు అలాంటిది ఊహించగలారా? ప్రీతం కూడా (విడుదలకు) ఒకవారం ముందే సంగీతం అందించినట్టు ఉంది. కనీసం సినిమాపై ముందే అభిప్రాయం కూడా తీసుకోకుంటే ఏం చెప్తాం. ఇప్పటి దర్శకులు అందరితో ఇదేరకంగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే సినిమాను చూపించి అభిప్రాయం తీసుకోవడం లేదు. తామేదో అణుబాంబును తయారుచేస్తున్నట్టు భావిస్తున్నారు. నేను (జగ్గాజాసూస్) సినిమాను ప్రేమించను, ద్వేషించను. కానీ సినిమాలో 20నిమిషాలు ఎడిట్ చేస్తే బాగుండేది. బస్సును ఎక్తాకపూర్ గెంటేయడం సరైనదే. (2010లో) కైట్ సినిమా సమయంలో రాకేష్ రోషన్‌తో కూడా అతను ఇలాగే వ్యవహరించాడు. అతను బాధ్యతారాహిత్యమైన దర్శకుడు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయడు. గత రెండేళ్లలో మూడుసార్లు ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయినా వాయిదా వేస్తూ వచ్చారు' అని రిషీ మండిపడ్డారు. అంతర్జాతీయంగా కొన్నిదేశాల్లో సినిమా విడుదల కాకపోవడానికి కూడా దర్శకుడు బసు చేసిన ఆలస్యమే కారణమని మండిపడ్డారు.