3 వారాల గరిష్టానికి రూపాయి
ముంబై: దేశీ కరెన్సీ మరికాస్త పుంజుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 36 పైసలు లాభపడి 62.14 వద్ద స్థిరపడింది. ఇది మూడు వారాల గరిష్టస్థాయి కావడం గమనార్హం. దేశీయంగా బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలకు దిగడంతో రూపాయి బలపడేందుకు దోహదం చేసింది. నవంబర్ 5న రూపాయి ముగింపు(61.62)తో పోలిస్తే మళ్లీ ఈస్థాయికి దగ్గర్లో స్థిరపడటం ఇదే తొలిసారి. బుధవారం దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు అక్కడక్కడే ఉన్నప్పటికీ.. డాలరు ఇండెక్స్ వరుసగా ఐదోరోజూ బలహీనంగా ట్రేడవడటం రూపాయికి చేదోడుగా నిలిచిందని అల్పరి ఫైనాన్షియల్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు.