కార్ల బీమా ప్రీమియంలకు రెక్కలు
ముంబై: ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణించిన నేపథ్యంలో కార్ల బీమా ప్రీమియానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కార్ల తయారీలో వినియోగించే విడి భాగాలను కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఇటీవల కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో కారు ధర ఆధారంగా నిర్ణయమయ్యే బీమా ప్రీమియాల్లోనూ పెరుగుదలకు అవకాశమున్నదని సాధారణ బీమా రంగ నిపుణులు తెలిపారు. సాధారణంగా కారు ధరను బట్టి బీమా ప్రీమి యం ఉంటుందని, అయితే ఇటీవల దిగుమతి చేసుకునే విడిభాగాల ఖరీదు పెరగడం వల్ల ఆటో కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయని భారతీ ఆక్సా సాధారణ బీమా విభాగం సీఈవో అమరనాథ్ అనంతనారాయణ్ చెప్పారు. వెరసి బీమా ప్రీమియంలు 15-20% పెరిగే అవకాశముందన్నారు. మే నెల తరువాత రూపాయి విలువ 20% పతనమైన సంగతి తెలిసిందే.