రూపీ .. మళ్లీ టపీ | Rupee tanks 110 paise, drops to 64.30 against US dollar | Sakshi
Sakshi News home page

రూపీ .. మళ్లీ టపీ

Published Tue, Aug 27 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

రూపీ .. మళ్లీ టపీ

రూపీ .. మళ్లీ టపీ

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, రిజర్వు బ్యాంకు ఎన్ని ధైర్యవచనాలు వల్లించినా... దేశీ కరెన్సీ మాత్రం చిక్కిశల్యమవుతూనే ఉంది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ కుప్పకూలింది. 110 పైసలు పడిపోయి 64.30వద్ద స్థిరపడింది. గత శుక్రవారంనాటి లాభాలు పూర్తిగా ఆవిరయ్యాయి. మరోపక్క, బ్రిటిష్ పౌండ్‌తో కూడా రూపాయి విలువ జారిపోయింది. క్రితం ముగింపు 98.47తో పోలిస్తే... 165 పైసలు దిగజారి 100.12కు పడిపోయింది.
 
  ముఖ్యంగా నెలాఖరులో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పోటెత్తడం, విదేశీ పెట్టుబడి నిధుల తిరోగమనం రూపాయి క్షీణతకు పురిగొల్పాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ట్రేడింగ్  చివర్లో దేశీ స్టాక్‌మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా డాలరు విలువ పుంజుకోవడం కూడా ప్రభావం చూపినట్లు చెప్పారు. మరోపక్క, భారత ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాన్ని గనుక చేరకోలేకపోతే దేశ సార్వభౌమ(సావరిన్) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌చేసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇది కూడా దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి.
 
 ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 63.20తో పోలిస్తే సోమవారం 63.65 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆతర్వాత క్షీణత జోరందుకుని ఒకానొకదశలో 64.75కు కూడా పడిపోయింది. అయితే, చివర్లో ఆర్‌బీఐ కొంత జోక్యం చేసుకొని ప్రభుత్వరంగ బ్యాంకులతో డాలర్లను విక్రయింపజేయడంతో రికవరీ జరిగినట్లు డీలర్లు పేర్కొన్నారు. దీంతో 64.30 వద్ద ముగిసింది. రూపాయి స్థిరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, నిరాశావాదం అక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలతో గత శుక్రవారం రూపాయి విలువ ఏకంగా 135 పైసలు ఎగబాకిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందురోజు దేశీ కరెన్సీ విలువ మునుపెన్నడూ లేనివిధంగా 65దిగువకు జారిపోయి ఇంట్రాడేలో 65.56 ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకింది. చివరకు 64.55 వద్ద స్థిరపడింది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైమ్ కనిష్ట ముగింపు.
 
 విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి...
 చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడం రూపాయిపై ఒత్తిడి పెంచిందని డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ రఘువంశీ  పేర్కొన్నారు. మరోపక్క, స్టాక్, బాండ్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) తిరోగమనం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 420 కోట్ల డాలర్ల బాండ్‌లను, గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో 75 కోట్ల డాలర్ల విలువైన షేర్లను నికరంగా వారు విక్రయించడం దీనికి నిదర్శనం.
 
 దీనికి అడ్డుకట్టవేయాలంటే తక్షణం ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్(ఇండియా) సీఈవో ప్రమిత్ బ్రహ్మభట్ వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం టాప్ బ్యాంకర్లు, ఎఫ్‌ఐఐలతో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, చిదంబరం భేటీ అయిన సంగతి తెలిసిందే. రూపాయి స్థిరీకరణ, మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేవిధంగా చర్యలు ఉంటాయని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ పేర్కొన్నారు కూడా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement