పాక్‌లో విన్యాసాలపై మాట మార్చిన రష్యా!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌తో కలిసి గిల్గిట్-బాల్టిస్తాన్‌లో తాను సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలను రష్యా తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగమేనని, ఈ ప్రాంతంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా వివరణ ఇచ్చింది. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పాక్‌తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించబోమని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
ప్రచ్ఛన్న యుద్ధం నాటి శత్రువైన పాకిస్థాన్‌తో కలిసి రష్యా తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. ఇందుకోసం రావల్పిండికి రష్యా సైనలు తరలివచ్చాయి. అయితే, గల్గిట్-బాల్టిస్తాన్ పరిధిలో ఉన్న రట్టు పర్వత ప్రాంతాల్లో ఉన్న పాక్ సైనిక స్కూల్‌లో ఈ సంయుక్త డ్రిల్స్ ఉంటాయని రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ టీఏఎస్‌ఎస్ (టాస్) కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సమస్యాత్మకమైన ఈ ప్రాంతంలో రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తే అది దాయాది దేశానికి దౌత్యపరమైన విజయం అవుతుంది. దీంతో అప్రమత్తమైన భారత్ గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగమేనని స్పష్టం చేసింది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌తో కలిసి ఇలాంటి చర్యకు దిగడంపై రష్యాకు తమ ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని రష్యా రాయబారా కార్యాలయం వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది. పీవోకేలో సంయుక్త సైనిక విన్యాసాలు ఉండబోవని స్పష్టం చేసింది. కేవలం చేరట్ ప్రాంతంలోనే డ్రిల్స్ ఉంటాయని, ఈ విషయంలో వచ్చిన కథనాలన్నీ తప్పుడువేనని తేల్చిచెప్పింది. దీంతో టాస్ కూడా తన కథనంలో పీవోకే ప్రస్తావనను తొలగించి.. కథనాన్ని ప్రచురించింది.