వీసా ఎఫెక్ట్: భారతీయులకు రష్యా రెడ్ కార్పెట్
వీసా ఎఫెక్ట్: భారతీయులకు రష్యా రెడ్ కార్పెట్
Published Tue, Mar 21 2017 8:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
న్యూఢిల్లీ : వీసాలో కఠినతరమైన నిబంధనలతో అమెరికా కంపెనీల్లో తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్న ఉద్యోగులకు ఇతర దేశాలు సాదరంగా ఆహ్వానాలు పలుకుతున్నాయి. కెనడా తర్వాత తాజాగా అమెరికాకు బద్దశత్రువైన రష్యా సైతం భారతీయులు వచ్చి తమ దేశంలో పనిచేసుకోవచ్చని పేర్కొంది. భారత టాలెంట్ ను మాత్రమే తాము ఆహ్వానించడం లేదని, తమ దేశంలో సౌకర్యవంతంగా నివసించే సాయం కూడా తాము అందిస్తామని రష్యా భరోసా ఇస్తోంది. అమెరికాలో వీసా మార్పులపై ప్రతిపాదనలు వెల్లువెత్తడం ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రష్యన్ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి డెనిస్ మన్టూరావ్ తెలిపారు.
''భారతీయులకు రష్యా వెల్ కం చెబుతోంది. ఎంతో ప్రతిభావంతులైన ఉద్యోగులకు రష్యా ఎప్పుడూ తలుపులు బార్ల తెరిచే ఉంచుతోంది. రష్యాలో సెటిల్ అవడానికి సాయపడతాం. గణితాభవజ్ఞులు, ఎక్కువ ప్రతిభకలిగిన ఉద్యోగులు కలిగి ఉండటంలో రష్యన్, భారతీయులే ప్రపంచంలో బెస్ట్. భారతీయులకు వెల్ కం చెప్పడానికి రష్యన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది'' అని మన్టూరావ్ చెప్పారు. ఈ రెండు దేశాలు కలిసి బిజినెస్ వెంచర్లు ఏర్పాటు చేసే ప్లాన్ ను రూపొందిద్దామని పేర్కొన్నారు.
70 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు ఉత్సవాల్లో భాగంగా మాన్టూరావ్ భారత్ కు విచ్చేశారు. గత ఆరు నెలల్లోనే ఈ రష్యన్ మంత్రిది రెండో పర్యటన. జూన్ 1 నుంచి 3 వరకు సెయింట్ పిటర్స్బర్గ్ లో జరుగనున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ కు ప్రధాని మోదీని ఈయన ఆహ్వానించనున్నారు. అతిథిగా ప్రధాని అక్కడికి వెళ్లనున్నారు. ఈ ఫోరమ్ లో భారత్ సైతం గెస్ట్ కంట్రీ.
Advertisement