ఢిల్లీ: మంచి జీతం అనగానే ట్రావెల్ ఏజెంట్ మాటలు నమ్మి హైదరాబాద్‌కు చెందిన అస్వాన్.. రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక బలవంతంగా సైన్యం చేర్పించారు. ఆపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ యువకుడు ప్రాణం విడిచాడు. రష్యాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మానవ అక్రమరవాణాను గుర్తించిన కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన చేసింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారతీయులు పలువురు చిక్కుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరిట ప్రైవేట్ సైన్యంలో చేరుస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ గుర్తించినట్లు తెలిపింది కేంద్రం.
మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో భారతీయుల్ని చేరుస్తున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసిందని కేంద్రం తెలిపింది. రష్యాలో ఉద్యోగాల పేరిట.. ఏజెంట్ల ఇచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ముఠాలు 35 మంది భారతీయుల్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment