భారత్‌లో ఉగ్రదాడులు చేశాం: సలాహుద్దీన్
లాహోర్/న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకు చాలాసార్లు ఉగ్ర దాడులకు పాల్ప డినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్(71) అంగీకరించాడు. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన అనంతరం ఆయన జియో చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మేం ఇప్పటివరకు కశ్మీర్‌లోని భారత బలగాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా వారిపైనే దాడులు కొనసాగుతాయి’ అని చెప్పాడు.
కశ్మీర్‌ను తన ఇంటిగా అభివర్ణించిన ఆయన.. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాతే లోయలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. భారత్‌లో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దాడి చేయగల సామర్థ్యం తమకుందని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచే తాము ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు భారత్‌లో చాలామంది మద్దతుదారులు ఉన్నారని వెల్లడించారు. తమ ఉద్యమానికి పాక్, చైనాలు దౌత్యపరంగా నైతికంగా మద్దతు ఇచ్చాయని వెల్లడించారు.