Syed Salahuddin
-
దావూద్, సలాహుద్దీన్‌లను అప్పగించాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్‌కు ఉంటే దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా వంటి ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు బాధ్యత వహించిన జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టడంలో పాక్ విఫలమైందని ఆరోపించాయి. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పాక్ పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత్‌కు చెందిన దావూద్, సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను అప్పగించాలని స్పష్టం చేశాయి. పాక్ ఇటీవల ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కొందరిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం అలంకారప్రాయంగా చేపట్టిన చర్య మాత్రమేనని, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపాయి. భారత్‌లో జరిగిన వరుస ఉగ్రదాడులతో సంబంధమున్న దావూద్, సలాహుద్దీన్‌లను అప్పగించాల్సిందిగా భారత్ గత కొంతకాలంగా పాక్‌ను కోరుతోంది. -
ఉగ్రచెర నుంచి ముగ్గురికి విముక్తి
శ్రీనగర్ : ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 11 మందిలో ముగ్గురిని శుక్రవారం విడుదల చేశారు. ముగ్గురు పోలీసుల కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు జమ్ము కశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వైద్ తెలిపారు. వీరిలో ఇద్దరు కుల్గాంకు, ఒకరు పుల్వామాకు చెందినవారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు గురు, శుక్రవారాల్లో దక్షిణ కశ్మీరులో పోలీసు కుటుంబాలకు చెందిన 11 మందిని అపహరించడంతో కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షకీల్ అహ్మద్‌ను గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. రెండు రోజుల క్రితం పోలీసులు తమ కుటుంబీకుల ఇళ్లపై దాడి చేసిన నేపథ్యంలో.. దానికి ప్రతీకారంగా కశ్మీర్ ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను అపహరించినట్టు తెలుస్తోంది. -
ఉగ్రనేతలకు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర నేతలు హఫీజ్ సయ్యిద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) గట్టి షాక్ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ అల్లర్ల సందర్భంగా ఉగ్ర కార్యకలాపాలకు సాయం అందించినందుకు వారి పేర్లను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆర్థిక సాయం వెనుక వేర్పాటు వాద నేతలు, కొందరు వ్యాపార వేత్తల హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలో 12 మంది పేర్లతో.. 1,279 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఢిల్లీలోని ఓ న్యాయస్థానానికి అందజేసింది. ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులను విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ కోర్టును ఎన్ఐఏ కోరగా.. కోర్టు నిర్ణయాన్ని తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఆరు నెలల విచారణ.. 60 ప్రాంతాల్లో తనిఖీలు, 300 మంది ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి వాంగ్మూలం సేకరణ.. 950 పత్రాల స్వాధీనం.. ఇలా అన్ని కోణాల్లో సాక్ష్యాలను సేకరించాకే ఎన్ఐఏ పక్కాగ ఈ ఛార్జ్ షీట్‌ను రూపొందించింది. లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యిద్ పేరును.. హురియత్ కాన్ఫెరెన్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్, దుఖ్టరన్-ఇ-మిలత్ సంఘాల అధినేత సయ్యద్ సలావుద్దీన్ పేర్లను ఛార్జ్ షీట్లో పేర్కొంది. వీరిద్దరు ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పటంతోపాటు వారికి ఆర్థిక సాయం అందించారని పేర్కొంది. ఇక జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ వాటాలి పేరు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉండటం విశేషం. మాజీ మిలిటెంట్ బిట్టా కరాటె, ఫోటో జర్నలిస్ట్ కమ్రాన్ యూసఫ్, జావేద్ అహ్మద్ భట్ పేర్లను కూడా ఎన్ఐఏ ఇందులో పొందుపరిచింది. రెండేళ్ల క్రితం భద్రతా దళాల కాల్పుల్లో బుర్హన్ వనీ మరణించిన తర్వాత కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి జ్యూడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. -
భారత్‌లో ఉగ్రదాడులు చేశాం: సలాహుద్దీన్
లాహోర్/న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకు చాలాసార్లు ఉగ్ర దాడులకు పాల్ప డినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్(71) అంగీకరించాడు. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన అనంతరం ఆయన జియో చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మేం ఇప్పటివరకు కశ్మీర్‌లోని భారత బలగాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా వారిపైనే దాడులు కొనసాగుతాయి’ అని చెప్పాడు. కశ్మీర్‌ను తన ఇంటిగా అభివర్ణించిన ఆయన.. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాతే లోయలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. భారత్‌లో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దాడి చేయగల సామర్థ్యం తమకుందని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచే తాము ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు భారత్‌లో చాలామంది మద్దతుదారులు ఉన్నారని వెల్లడించారు. తమ ఉద్యమానికి పాక్, చైనాలు దౌత్యపరంగా నైతికంగా మద్దతు ఇచ్చాయని వెల్లడించారు. -
‘అతడు ఉగ్రవాదే.. అమెరికా సరిగ్గా పేరు పెట్టింది’
న్యూఢిల్లీ: హిబ్జుల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. అతడు ఇటీవల మాట్లాడిన తీరే అతడు ఉగ్రవాది అని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. అమెరికా అతడికి ప్రపంచ ఉగ్రవాది అని పేరు పెట్టిందని, దానికి అతడు తగినవాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. భారత్‌లోపల ఎక్కడంటే అక్కడ తాము దాడులు చేయగలం అని సలావుద్దీన్ ఈ నెల 1న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి అశోక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ భారత్‌కు వ్యతిరేకంగా చేసిన మాటలే అతడు ఉగ్రవాది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ‘అతడు అంతర్జాతీయ ఉగ్రవాది అని అమెరికా అతడికి తగిన పేరే పెట్టింది’ అని అన్నారు. -
సలావుద్దీన్ అంతర్జాతీయ ఉగ్రవాది
మోదీ–ట్రంప్ భేటీకి ముందు అమెరికా ప్రకటన వాషింగ్టన్: కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశానికి కొద్దిగంటలముందే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. సోమవారం వెలువడిన ఈ నిర్ణయంతో.. సలావుద్దీన్‌తో అమెరికన్లు ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపటం, సంబంధాలు నెరపటం పూర్తిగా నిషేధం. దీంతోపాటుగా అమెరికా అధికార పరిధిలోని ప్రాంతా ల్లోని సలావుద్దీన్ ఆస్తులు పూర్తిగా జప్తుచేయబడతాయి. కశ్మీర్ వివాదంలో శాంతియుత పరిష్కారానికి తాను పూర్తిగా వ్యతిరేకమని సలావుద్దీన్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలి సిందే. దీంతోపాటుగా మరింతమంది కశ్మీరీ యువకులను మానవబాంబులుగా మార్చి.. లోయను భారత సైనికుల మరుభూమిగా మారుస్తామని హెచ్చరికలు కూడా జారీచేశాడు. సలావుద్దీన్ నేతృత్వంలో హిజ్బుల్ (పాక్ కేంద్రంగా) ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడ్డారు. వందలమందిని పొట్టనపెట్టుకున్నారు. కాగా, అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇరుదేశాలు ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం చాలా కీలకమని పేర్కొంది. -
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదు!
కరాచీ: కశ్మీర్ కోసం భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు సార్లు యుద్ధం జరిగిందని, కశ్మీర్ ప్రజలు రాజీ పడేందుకు సిద్ధంగా లేనందున నాలుగోసారీ యుద్ధం జరగొచ్చని చెప్పారు. కశ్మీరీలకు నైతికంగా మద్దతిచేందుకు పాక్ కట్టుబడి ఉందని, పాక్ సహకరిస్తే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆదివారం విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాని హత్య.. కశ్మీర్ కోసం జరుగుతున్న పోరాటానికి కొత్త అర్థాన్నిచ్చిందన్నారు. -
సిమీ మాజీ చీఫ్ సలావుద్దీన్ మృతి
ఒంగోలు : నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ మృతి చెందాడు. చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొనటంతో అందుల్లో ప్రయాణిస్తున్న సలావుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. మృతి చెందిన సలావుద్దీన్‌పై పలు కేసులు ఉన్నాయి.