సలావుద్దీన్ అంతర్జాతీయ ఉగ్రవాది
మోదీ–ట్రంప్ భేటీకి ముందు అమెరికా ప్రకటన
వాషింగ్టన్: కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశానికి కొద్దిగంటలముందే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. సోమవారం వెలువడిన ఈ నిర్ణయంతో.. సలావుద్దీన్‌తో అమెరికన్లు ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపటం, సంబంధాలు నెరపటం పూర్తిగా నిషేధం.
దీంతోపాటుగా అమెరికా అధికార పరిధిలోని ప్రాంతా ల్లోని సలావుద్దీన్ ఆస్తులు పూర్తిగా జప్తుచేయబడతాయి. కశ్మీర్ వివాదంలో శాంతియుత పరిష్కారానికి తాను పూర్తిగా వ్యతిరేకమని సలావుద్దీన్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలి సిందే. దీంతోపాటుగా మరింతమంది కశ్మీరీ యువకులను మానవబాంబులుగా మార్చి.. లోయను భారత సైనికుల మరుభూమిగా మారుస్తామని హెచ్చరికలు కూడా జారీచేశాడు. సలావుద్దీన్ నేతృత్వంలో హిజ్బుల్ (పాక్ కేంద్రంగా) ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడ్డారు. వందలమందిని పొట్టనపెట్టుకున్నారు. కాగా, అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇరుదేశాలు ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం చాలా కీలకమని పేర్కొంది.