
సమైక్య యాగం
సాక్షి నెట్‌వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరగకుండా సాగుతోంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 78రోజులుగా సాగుతున్న జనోద్యమం బుధవారం నాడూ ఉద్ధృతంగా ఎగసింది. బక్రీద్‌ను పురస్కరించుకుని ముస్లింలు సమైక్య రాష్ట్రం కోసం పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జాతీయ రహదారిపై సుదర్శన యాగం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో జాతీయ రహదారిపై మహా సుదర్శన యాగం నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర విభజనపై ప్రజాభిపాయ సేకరణ చేపట్టారు. ఈ పోలింగ్‌లో సకల జనులు సమైక్య రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. విశాఖ జిల్లా భీమిలి, అనకాపల్లిలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, భోగాపురం, గజపతినగరం, పార్వతీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మంత్రుల చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీలపై కుళ్లిన టమాటాలు, కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు.
హైవేపై రాస్తారోకో : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. వెంకటగిరిలో భిక్షాటనతో నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ముస్లింలు, ఉద్యోగ జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు రాసిన ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే దీక్ష చేపట్టారు. కృష్ణాజిల్లా పామర్రులో కళ్లకు గంతలు కట్టుకుని జేఏసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో విభజనవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సమైక్యవాదులు ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించారు.
ముస్లింల ర్యాలీ : వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్లలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. జమ్మలమడుగులో వేలాది మంది రైతులు పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టారు. బద్వేలులో ఉపాధి హామీ సిబ్బంది, మైదుకూరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రాయచోటిలో సమైక్యవాదుల రిలే దీక్షలకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈద్గా బయట సమైక్య నినాదాలు చేశారు. మదనపల్లెలో సమైక్యవాదులు గొంతులకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పామిడిలో మంత్రుల కమిటీ గో బ్యాక్ అంటూ సమైక్యవాదులు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం విడిపోతే ఉపాధి కరువవుతుందని బెళుగుప్పలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే రాళ్లు..రప్పలు తిని బతకాల్సి వస్తుందంటూ అనంతపురంలో ఎస్కేయూ విద్యార్థులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్రనే కొనసాగిస్తామని కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు సమ్మె విరమించేది లేదంటూ ఏపీఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు, డిగ్రీ అధ్యాపకులు కర్నూలులో ప్రతిజ్ఞ బూనారు.
ప్రజాప్రతినిధుల ప్రమాణాలు : రాష్ట్ర శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని సీమాంధ్రలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రతినబూనారు. తూ.గో.జిల్లా అమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల వద్దకు వచ్చిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తాను అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తానని ప్రతిజ్ఞ చేశారు. తాను రాసి తెచ్చిన ప్రమాణ పత్రాన్ని జేఏసీ ప్రతినిధులకు చదివి వినిపించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే, మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తాము సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉంటానని ఆయా ప్రాంతాల్లో ఎన్జీవోలకు హామీపత్రం రాసిచ్చారు.
ఉద్యమంలో అలసి కోమాలోకి..
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు వీఆర్వోగా పనిచేస్తున్న కొండా దేవదాసు రెండు నెలలకు పైగా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మంగళవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆందోళన అనంతరం తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామమైన నార్నెపాడు వెళ్తుండగా ఉద్వేగానికిలోనైన దేవదాసు వాహనంపై నుంచి పడిపోయారు. వెంటనే సహచరులు విజయవాడ ఆస్పత్రికి తరలించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతను అపస్మారక స్థితికి చేరకున్నాడని తెలిపారు. నరాలు చిట్లిపోవడంతో పరిస్థితి ఆందోళనగానే ఉందని చెబుతున్నారు. రెండు నెలలుగా వేతనాలు లేక, ఇళ్లు గడిచే పరిస్థితి లేకపోవటంతో భార్య కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, రాష్ట్ర విభజనపై కలత చెంది అనంతపురం జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు బుధవారం మరణించారు.
ఆగని ప్రజాగ్రహం
సాక్షి నెట్‌వర్క్ : అధికారపార్టీ నేతలు, మంత్రులపై ప్రజాగ్రహం కొనసాగుతోంది. టీటీడీ పాలక మండలి చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఆయన ఇంటికి వస్తున్న రైతులను పోలీసులు నిలువరించారు. దీంతో సుమారు రెండు గంటలసేపు రైతులు అక్కడే వేచిచూసి పోలీసులను దాటి తోసుకువె ళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు జేఏసీ జిల్లా అధ్యక్షుడు నిమ్మల రామానాయుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు రైతులకు గాయాలయ్యాయి.
నెల్లూరులో ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. తొలుత మంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను మంత్రి ఇంటి గేటు ముందు దహనం చేశారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ఇంటి ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇక సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం చేస్తామని కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పల్లంరాజు వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ కర్నూలులో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.