సీమాంధ్రలో.. ఉప్పెనంత ఉద్యమం | samaikyandhra movement raises in seemandhra regions | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో.. ఉప్పెనంత ఉద్యమం

Published Thu, Aug 15 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

సీమాంధ్రలో.. ఉప్పెనంత ఉద్యమం

సీమాంధ్రలో.. ఉప్పెనంత ఉద్యమం

సాక్షి  నెట్‌వర్క్: సమైక్యమే శ్వాసగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులకు సకల జనుల సమ్మె తోడవడంతో సమైక్యపోరాటం తారస్థాయికి చేరింది. మలిరోజూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. సమ్మెకు తోడుగా అడుగడుగునా సమైక్యవాదులు బుధవారం నిరసనలను హోరెత్తించారు. ప్రజలే కదలివచ్చి   స్వచ్ఛందంగా భాగస్వాములైతే ఉద్యమం ఏ రూపులో ఉంటుందో ప్రస్తుత సమైక్యాంధ్ర పోరు అద్దంపడుతోంది. తెలుగు మాట్లాడే వారంతా కలిసుందామనే భావోద్వేగంతో రాజకీయాలు, వర్గాలు, కులాలు, మతాలకతీతంగా జనం ముందుకొచ్చి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా విస్పష్ట ప్రకటన చేసిన వైఎస్సార్ సీపీకి బాసటగా నిలుస్తూ, వేర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ నేతలపైనా, రెండు కళ్ల సిద్ధాంతంతో ఇరువర్గాలనూ ఏమారుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఎక్కడికక్కడ సమైక్యవాదులు కాంగ్రెస్, టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు.
 
 కాంగ్రెస్, టీడీపీ నేతల అడ్డగింత
 కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన 200 మంది ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించేందుకు  టీడీపీ ఎమ్మెల్యేలు కేయీ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ రాగా, నీటిపారుదల శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన సింహగర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతుండగా దొంగ రాజీనామాలు చేసిన వారికి మాట్లాడే హక్కు లేదంటూ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో డిజిటల్ ప్లెక్సీల్లో   చిరంజీవి, లగడపాటి, సాయిప్రతాప్, పురంధేశ్వరి చిత్రాలను ముద్రించి సీమాంధ్ర దొంగలుగా ప్రకటించారు. ఈ దొంగలను పట్టించినవారికి రూ.10లక్షలు నగదు బహుమతి ఇస్తామంటూ రాసిన ఫ్లెక్సీలను ఊరేగించారు. మంత్రి వట్టి వసంతకుమార్‌ను గణపవరంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా  కదిరిలో  జేఏసీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించడానికి రాగా, అప్పటి వరకు కూర్చొన్న వారంతా ‘మీ మొహాలు చూపించవద్ద’ంటూ లేచి వెళ్లిపోయారు.
 
 సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు
 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో  రెండువేల మందికి పైగా రెవెన్యూ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళాలు వేసి దీక్షలు చేపట్టారు. రాజమండ్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆకులు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్నన చేశారు. వివిధ శాఖల ఉద్యోగులు కాకినాడలో కలెక్టరేట్‌ను ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపజేశారు.  రాజమండ్రి, కాకినాడ, ఏలేశ్వరం డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మెయిన్ రోడ్డుపై స్నానం చేస్తూ రంపచోడవరం ఎంపీడీవో విశ్వనాథ్ నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు ఎదురుగా భారీ మానవహారం ఏర్పాటు చేశారు.
 
 షార్ ఉద్యోగుల ర్యాలీ
 నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఉద్యోగులు, వారి సతీమణులు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు.అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జెడ్పీ ఎదురుగా పీఆర్‌జేఏసీ చేపట్టిన దీక్షలకు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.
 
 20వేలమందితో భారీ ప్రదర్శన
 హిందూపురంలో రెడ్డి సేవా సంఘం, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి సారథ్యంలో 20వేలమందితో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై పలుచోట్ల వంటావార్పులు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది. అటు ఒడిశా, కోల్‌కతా వెళ్లాల్సిన లారీలు, సరకుల వాహనాలు, ఇటు చెన్నై, కేరళ వెళ్లాల్సిన సరకుల లోడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ పోర్టుకు  లారీల రాక ఆలస్యమవడంతో నౌకలు సకాలంలో కార్గోతో వెళ్లలేకపోయాయి.
 
 థింసా నృత్యంతో గిరిజనుల నిరసన
 విశాఖ ఏజెన్సీలోని 11మండలాల్లో బంద్ పూర్తిస్థాయిలో జరిగింది.  పర్యాటక ప్రాంతమైన అరకులో గిరిజనులంతా కలిసి విభజనకు వ్యతిరేకంగా  సాంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు. శ్రీకాకుళంలో రెవెన్యూ, జిల్లా పరిషత్ ఉద్యోగుల దీక్షా శిబిరాలను  పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు.  సీతంపేట ఐటీడీఏ ఉద్యోగులు విధులు బహిష్కరించారు.
 
 ఎన్జీఓల మానవహారం
 ఏలూరులో ఎన్జీవోలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సత్తి చంద్రారెడ్డి అనే రైతు పెనుమంట్ర మండలం మార్టేరులో బుధవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
 
 ‘నిజం తెలుసుకో తెలుగు సోదరా’
 ‘నిజం తెలుసుకో తెలుగు సోదరా’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకు సుముఖత వ్యక్తం చేయలేదంటూ  దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లతో రూపొందించిన పోస్టర్లను వైఎస్సార్ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆవిష్కరించారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రి, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వైద్య విద్యార్ధులు మహానాడు జంక్షన్‌లో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. దీంతో హైవేపై రెండుగంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్  ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు.
 
 గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్‌ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి లాడ్జి సెంటర్ వరకు వేలాదిమంది కార్యకర్తలు పాదయాత్ర చేశారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మేకతోటి సుచరిత, జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు నేతలు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మెట్లుదిగుతున్న సుచరిత స్వల్ప అస్వస్థతకు లోనై కాసేపు అక్కడే కూర్చుండిపోయారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన  ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి మద్దతు తెలిపారు.
 
 మోకాళ్లపై కూర్చుని టీచర్ల నిరసన
 ఆత్మకూరులో టీచర్లు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. అనంతరం గౌడుసెంటర్ వద్ద మోకాళ్లపై నిలిచి నిరసన వ్యక్తం చేశారు. కడపలో ఆర్టీపీపీ ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్లపైనే నిరసన తెలియజేస్తూ రిలే దీక్షలు ప్రారంభించారు.  బద్వేలులో పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారులపై రోడ్లకు అడ్డంగా కంపచెట్లు వేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
 
 విద్యార్థుల రక్తదానం
 విజయనగరం పట్టణంలో  వివిధ వర్గాల ఉద్యమకారులు ప్రతీ ఐదు నిమిషాలకు మానవహారాలు, నిరసనలు నిర్వహించారు.  80మంది విద్యార్థులు రక్తదానం చేశారు.
 
 ‘వేర్పాటు’పై యుద్ధమే.. విశాఖ సింహగర్జనలో తీర్మానం
 కేంద్రం తీసుకున్న వేర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు సమైక్య పోరాటం ఆపేది లేదని విశాఖలో  జరిగిన సింహగర్జనలో సమైక్యవాదులు తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్ర యూనివర్సిటీలకు చెందిన జేఏసీ నేతలు, ఎమ్మెల్యేలు, కళాకారులు, విద్యార్థులు హాజరయ్యారు.   వంగపండు ప్రసాదరావు బృందంతో పాటు వివిధ సంఘాలకు చెందిన కళాకారులు గజ్జెకట్టి ఆటపాట వినిపించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర పౌరులకు రక్షణ కల్పించడం కోసం రాజధానిలో భారీ బహిరంగ సభ, త్వరలో ఛలో ఢిల్లీ చేపట్టాలని తీర్మానించారు. సమైక్యాంధ్ర కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 350కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించారు.
 
 విభజన భయానికి  మరో తొమ్మిదిమంది బలి
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. సీమాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తొమ్మిదిమంది తనువు చాలించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలంలోని ఎం. బండపల్లెకు చెందిన ముత్తుస్వామి(46) రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయేమోనన్న అనుమానంతో తీవ్ర ఆందోళనకు గురై బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి.కొత్తకోట మండలం నామాలపల్లె దళితవాడకు చెందిన వ్యవసాయ కూలీ గోపాలు(47) గుండెపోటుతో మృతిచెందాడు. కార్వేటినగరం మండలం ఎంఎం విలాసం పంచాయతీ ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన టైలర్ సీ భాస్కర్(40), వీ.కోట మండలం నక్కనపల్లెకు చెందిన చలపతి(41) టీవీల్లో వార్తలు చూస్తూ గుండెపోటుతో కన్నుమూశారు.
 
 కృష్ణాజిల్లా కూచిపూడి మండలం మొవ్వ అంబేద్కర్ నగర్‌కు చెందిన గద్దె సుబ్బారావు (60) మంగళవారం టీవీ చూస్తూ హఠాత్తుగా కిందపడిపోయి చనిపోయినట్టు బంధువులు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న డి. మునిస్వామి రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను చూసి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం పి. ధర్మవరం గ్రామానికి చెందిన చిందాడ అప్పారావు (58) సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో బుధవారం టీవీ చూస్తూ భావోద్వేగానికి గురై హఠాన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పారావుకు కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియల బాధ్యతను అతని నలుగురు కుమార్తెలూ భుజానకెత్తుకున్నారు. సమైక్యాంధ్ర ఇక సాధ్యం కాదేమోనని మనస్తాపం చెంది అనంతపురం జిల్లా లేపాక్షి మండలం విభూదిపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరప్ప (62) గుండెపోటుతో మృతి చెందాడు. విభజన వార్తలతో గత వారంరోజులుగా మనస్తాపంతో ఉన్న  వైఎస్సార్ జిల్లా వేంపల్లె దళితవాడకు చెందిన శీలం రాజు (28) ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement