
మంత్రి లుంగీ విప్పేసి సినిమా చూపించాడు
మీరట్: మంత్రి పదవిలో ఉన్నతహోదాలో ఉన్నాననే విషయం మరిచిపోయాడు. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే చిల్లరవేషాలు వేశాడు. మంత్రిగారు ఏకంగా లుంగీ విప్పేసి అసభ్యకరరీతిలో స‍్టెప్పులేశాడు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత, ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మహమ్మద్ ఫారుఖ్ హసన్ చేసిన నిర్వాకమిది. ఈ తతంగాన్ని ఎవరు వీడియో తీశారో తెలియదు కాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి ఒళ్లు మరచిపోయి డాన్స్ చేసినప్పటి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయ్యింది.
ఇంట్లోనో లేక గెస్ట్ హౌజ్లోనో తెలియదు కాని బనియన్, లుంగీతో ఉన్న మంత్రి హసన్ మాంచి జోష్తో స్టెప్పులు ఇరగదీశారు. అక్కడున్న కొందరు చప్పట్లు కొడుతూ మంత్రిని ఎంకరేజ్ చేశారు. డాన్స్ చేస్తూ మధ్యలో సోఫాలో పడిపోయిన మంత్రి.. లేచి లుంగీ విప్పేసి మళ్లీ కట్టుకుని స్టెప్పులేశారు. ఈ వీడియో బయటకురావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి గతంలోనూ ఇలా అసభ్యకరరీతిలో డాన్స్ చేసినట్టు స్థానికులు తెలిపారు.
మంత్రి హసన్ మాత్రం ఇది తనపై జరిగిన కుట్ర అని చెబుతున్నారు. దీనివెనుక పంచ్లీ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల హస్తముందని ఆరోపించారు. వాళ్లు తనను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు.