Samajwadi Party leader
-
లోక్‌సభలో ఎస్పీపక్ష నేతగా అఖిలేశ్ యాదవ్
లక్నో: లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ పక్షనేతగా అఖిలేశ్ యాదవ్ వ్యవహరిస్తారు. ఆ పార్టీ ఎంపీలు ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. అఖిలేశ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, లోక్‌సభ ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత తమ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడిగా అఖిలేశ్ యాదవ్‌ను లాంఛనంగా ఎన్నుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రాజేంద్ర చౌదరి శనివారం చెప్పారు. అఖిలేశ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
వివాహేతర సంబంధం : రాజకీయ నేత మృతి
లక్నో : సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ నాయకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి సదరు రాజకీయ నాయకున్ని అతని ఇంట్లోనే తుపాకీతో కాల్చి చంపాడు. వివరాల ప్రకారం.. సంభాల్, నాయి బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్న జగ్దీష్ మాలి (33) సమాజ్‌వాది పార్టీకి చెందిన నాయకుడు. అయితే మాలి భార్యకు దిలీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం గురించి గతంలో భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మాలి ఇంట్లో లేని సమయంలో దిలీప్ అతని ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మాలి తన భార్య, దిలీప్‌తో ఉండటం చూసి అతనితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో దిలీప్ తన దగ్గర ఉన్న తుపాకితో మాలి మీద కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మాలి అక్కడికక్కడే మృతి చెందాడు. మాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాలి భార్యను, దిలిప్‌ను ఆరెస్ట్ చేశారు. -
భయపడి గోవును వెనక్కి ఇచ్చేశారు!
రామ్‌పూర్ : రోజురోజుకు మూకదాడులు.. హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లిం నేతలు ఆవులను పెంచుకునేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ భార్య, రాజ్యసభ సభ్యురాలు తంజీమ్ ఫాతిమా తన ఇంట్లో ఆవుపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనకు ఓ సాధువు నుంచి కానుకగా వచ్చిన ఆవును తిరిగిచ్చేశారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో ముస్లిం యువకుడు రగ్బర్ ఖాన్‌ను కొట్టి చంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘గోవధ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయి. మాకు చాలా బాధగా ఉంది. అందుకే ఇటీవల ఓ సాధువు ఎంతో ప్రేమతో మాకు కానుకగా ఇచ్చిన గోవును గోశాలకే తిరిగి ఇచ్చేస్తున్నాం. మేం ముస్లింలం అయిన కారణంగా ఎవరైనా ఆ గోవును చంపేసి మా కుటుంబంపై నింద మోపుతారన్న భయంతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని’ తంజీమ్ ఫాతిమా వివరించారు. గోశాలలకు రూ.25లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ హాయాంలోనే మైనార్టీలపై దారుణాలు జరుగుతున్నాయని, ముస్లింలకు రక్షణ కరువైందని విమర్శించారు. గోశాలలకు ముస్లింలు దూరంగా ఉండాలని, ముస్లింలు ఆవులను పెంచుకోవద్దని, పాల వ్యాపారం లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని అజాంఖాన్ పిలుపునిచ్చారు. మనం ఆవులను తాకితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఆధార్ డేటా కొనొచ్చా.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..!
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వందల రూపాయలు చెల్లించి ఇతరుల ఆధార్ సమాచారం సులువుగా సేకరించవచ్చునంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణల్ని కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఆధార్ డేటా ఎప్పుడూ భద్రంతగానే ఉంటుందని, ఇతరుల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ డేటాకు గోపత్య లేదని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అని ప్రశ్నకు మంత్రి రవిశంకర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 4న యూఐడీఏఐ (ఆధార్ సంస్థ) ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సైబర్ విభాగం పోలీసులు ఆధార్ చట్టం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. 'విపక్ష నేతలు ఆధార్ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ డబ్బు చెల్లించి ఆధార్ సమాచారాన్ని చోరీ చేసినట్లు దేశంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆధార్ వివరాలపై గోప్యత ఉంటుందని అర్థమవుతోంది. ఆధార్ సంస్థ స్వయంగా ఓ వ్యక్తిపై డేటా దుర్వినియోగం చేశాడని ఫిర్యాదు చేయగా ఢిల్లీ సైబర్ విభాగం విచారణ చేపట్టింది. ఆధార్ డేటాపై అభద్రత భావాన్ని దూరం చేసుకోవాలి. రూ.500 చెల్లించి ఇతరుల ఆధార్ డేటా వ్యక్తిగత సమాచారాన్ని పొందడం తేలికంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆధార్‌పై పుట్టకొస్తున్న వదంతులను నమ్మవద్దని' మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతిక్షాల వాదనకు, ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతుండటం గమనార్హం. -
నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
-
నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
రాంపూర్: ఇటీవలే జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయినా.. మాజీ మంత్రి ఆజం ఖాన్ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. రాంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ నెల 11న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆజం ఖాన్.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ గుప్తాతో దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యం వీడియో కెమెరాలో రికార్డయ్యింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తాను బురద రోడ్డులో వెళ్లి విజయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆజాం ఖాన్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి తన కారును అనుమతించనందుకు ఆజంఖాన్.. గుప్తాను పరుష పదజాలంతో హెచ్చరించారు. 'ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కోడ్ ఉండదు. అప్పుడు నీ సంగతి తేలుస్తా. నేను బురద రోడ్డులో నడిచి వచ్చేలా చేస్తావా? నువ్వు ఏడ్చేలా చేస్తా. బదిలీ చేయాలని వేడుకొంటావు. అధికారముందని ఇలా ప్రవర్తిస్తావా?' అంటూ ఆజంఖాన్ చిందులు తొక్కారు. ఈ మాటలన్నీ వీడియో కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్పీ సీనియర్ నేత అయిన ఆజం ఖాన్.. అఖిలేష్ యాదవ్ మంత్రి వర్గంలో పనిచేశారు. గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు, చర్యలతో వివాదాస్పదమయ్యారు. -
మంత్రి లుంగీ విప్పేసి సినిమా చూపించాడు
మీరట్: మంత్రి పదవిలో ఉన్నతహోదాలో ఉన్నాననే విషయం మరిచిపోయాడు. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే చిల్లరవేషాలు వేశాడు. మంత్రిగారు ఏకంగా లుంగీ విప్పేసి అసభ్యకరరీతిలో స్టెప్పులేశాడు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత, ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మహమ్మద్ ఫారుఖ్ హసన్ చేసిన నిర్వాకమిది. ఈ తతంగాన్ని ఎవరు వీడియో తీశారో తెలియదు కాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి ఒళ్లు మరచిపోయి డాన్స్ చేసినప్పటి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అయ్యింది. ఇంట్లోనో లేక గెస్ట్ హౌజ్లోనో తెలియదు కాని బనియన్, లుంగీతో ఉన్న మంత్రి హసన్ మాంచి జోష్‌తో స్టెప్పులు ఇరగదీశారు. అక్కడున్న కొందరు చప్పట్లు కొడుతూ మంత్రిని ఎంకరేజ్ చేశారు. డాన్స్ చేస్తూ మధ్యలో సోఫాలో పడిపోయిన మంత్రి.. లేచి లుంగీ విప్పేసి మళ్లీ కట్టుకుని స్టెప్పులేశారు. ఈ వీడియో బయటకురావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి గతంలోనూ ఇలా అసభ్యకరరీతిలో డాన్స్ చేసినట్టు స్థానికులు తెలిపారు. మంత్రి హసన్ మాత్రం ఇది తనపై జరిగిన కుట్ర అని చెబుతున్నారు. దీనివెనుక పంచ్లీ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల హస్తముందని ఆరోపించారు. వాళ్లు తనను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు. -
మెమన్ భార్యకు రాజ్యసభ సీటు?
ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలకు సమాజవాదీ పార్టీ (ఎస్పీ) నాయకులు పెట్టింది పేరు. మహారాష్ట్రలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్‌కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్‌కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఫరూక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ములాయం సింగ్‌కు లేఖ రాశారు. దేశంలోని ముస్లింల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను పెద్దల సభలో వినిపించేందుకు ఓ గొంతు కావాలి.... ఈ నేపథ్యంలో రహీన్‌కు ఈ అవకాశం ఇస్తే... వారి కోసం ఆమె పోరాడుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మహారాష్ట్రలోని పలు పార్టీలు నిప్పులు చెరిగాయి. మెమన్‌కు ఉరిశిక్షపై సుప్రీం కోర్టు కోర్టు నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజకీయం చేయొవద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఎస్పీ నాయకులకు హితవు పలికారు. అయినా ఈ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. దానికి మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ బీజేపీ నాయకుడు మాదవ్ బండార్ సమాజ్ వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ విషయంపై ఎస్పీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అసిం అజ్మీ స్పందించారు. ఇది ఫరూక్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ అంశంపై ఆయన పార్టీని ఎప్పుడు సంప్రదించలేదన్నారు. అయినా ఈ విషయంపై ఆయన్ని వివరణ కోరతామని... ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. -
'పాకిస్తాన్ జిందాబాద్.. మోడీ ముర్దాబాద్'
లక్నో:పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత మహ్మద్ అలాంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా.. పాకిస్తాన్ కు అనుకూలంగా ఆయన నినాదాలు చేసిన తాజా వివాదానికి తెరలేపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝింఝానా పట్టణంలో నివాసం ఉంటున్న ఆయన మీరట్-కర్నాల్ రహదారిపై వెళుతున్న జనాల నుంచి డబ్బులు వసూలు చేసే క్రమంలో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో రెచ్చిపోయిన ఆ నేత పాకిస్తాన్ కు అనుకూలంగా.. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో తాగి ఉన్న అలాం.. పాకిస్తాన్ 'జిందాబాద్'.. మోడీ 'ముర్దాబాద్' అంటూ హోరెత్తించారు. ప్రభుత్వం కుట్ర పూరిత చర్యలో భాగంగానే తనను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. దీంతో ఆ నేతను అరెస్టు చేశారు. ఆ తరహా ఘటనలు స్థానికంగా శాంతిని హరించే పరిస్థితి ఉన్నందున అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయిన అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. -
పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు సహజం
వరుస అత్యాచార ఘటనలతో ఓ వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంటే, మరోవైపు అక్కడి అధికార పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉంటున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలోఅతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమేనంటూ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొహిసిన్ ఖాన్ గురువారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సెలవిచ్చారు. యువతీ యువకుల మధ్య సంబంధాలు చెడితే అత్యాచారం చేశారంటూ బాధిత మహిళలు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా ఉన్నాయని, కావాలంటే వెళ్లి గూగుల్ సెర్చ్‌లో వెతుక్కోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సెలవిచ్చారు. బడౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, చెట్టుకు ఉరివేసి హత్య..అత్యాచారాన్ని అడ్డుకుందని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు.. మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం.. తాజాగా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం, ఉరి ఇలా రాష్ట్రంలో వారం పది రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్బంగా ఆ ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం అఖిలేష్ యాదవ్ నిన్న పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా యూపీలో జరిగిన సంఘటనలను మీడియానే అధికంగా చేసి చూపుతోందంటూ ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, సీం అఖిలేష్ యాదవ్‌లు మీడియాపై రుసరుసలాడిన సంగతి తెలిసిందే.