నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
రాంపూర్: ఇటీవలే జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయినా.. మాజీ మంత్రి ఆజం ఖాన్ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. రాంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ నెల 11న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆజం ఖాన్.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ గుప్తాతో దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యం వీడియో కెమెరాలో రికార్డయ్యింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తాను బురద రోడ్డులో వెళ్లి విజయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆజాం ఖాన్ చెప్పారు.
కౌంటింగ్ కేంద్రంలోకి తన కారును అనుమతించనందుకు ఆజంఖాన్.. గుప్తాను పరుష పదజాలంతో హెచ్చరించారు. 'ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కోడ్ ఉండదు. అప్పుడు నీ సంగతి తేలుస్తా. నేను బురద రోడ్డులో నడిచి వచ్చేలా చేస్తావా? నువ్వు ఏడ్చేలా చేస్తా. బదిలీ చేయాలని వేడుకొంటావు. అధికారముందని ఇలా ప్రవర్తిస్తావా?' అంటూ ఆజంఖాన్ చిందులు తొక్కారు. ఈ మాటలన్నీ వీడియో కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్పీ సీనియర్ నేత అయిన ఆజం ఖాన్.. అఖిలేష్ యాదవ్ మంత్రి వర్గంలో పనిచేశారు. గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు, చర్యలతో వివాదాస్పదమయ్యారు.