
'పాకిస్తాన్ జిందాబాద్.. మోడీ ముర్దాబాద్'
లక్నో:పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత మహ్మద్ అలాంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా.. పాకిస్తాన్ కు అనుకూలంగా ఆయన నినాదాలు చేసిన తాజా వివాదానికి తెరలేపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝింఝానా పట్టణంలో నివాసం ఉంటున్న ఆయన మీరట్-కర్నాల్ రహదారిపై వెళుతున్న జనాల నుంచి డబ్బులు వసూలు చేసే క్రమంలో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో రెచ్చిపోయిన ఆ నేత పాకిస్తాన్ కు అనుకూలంగా.. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ సమయంలో తాగి ఉన్న అలాం.. పాకిస్తాన్ 'జిందాబాద్'.. మోడీ 'ముర్దాబాద్' అంటూ హోరెత్తించారు. ప్రభుత్వం కుట్ర పూరిత చర్యలో భాగంగానే తనను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. దీంతో ఆ నేతను అరెస్టు చేశారు. ఆ తరహా ఘటనలు స్థానికంగా శాంతిని హరించే పరిస్థితి ఉన్నందున అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయిన అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.