మూడు రోజుల ఆలస్యంగా నోట్7
టెక్ దిగ్గజం శాంసంగ్, గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్ అమ్మకాలను జాప్యం చేయనుందట. సెప్టెంబర్ 28న గెలాక్సీ నోట్7 అమ్మకాలను దక్షిణ కొరియాలో చేపడతామన్న శాంసంగ్, మూడు రోజుల ఆలస్యంగా అక్టోబర్ 1 నుంచి విక్రయించనునున్నట్టు ప్రకటించింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను ఆపివేసి, ఆ ఫోన్లను రీకాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చేపడుతున్న రీకాల్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఈ అమ్మకాలను జాప్యం చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 2న రీకాల్ ప్రాసెస్ను అధికారికంగా ప్రారంభించిన శాంసంగ్, 2.5 మిలియిన్ గెలాక్సీ నోట్7లను వెనక్కి తీసుకుంది. రీకాల్ కింద రీప్లేస్మెంట్గా సురక్షితమైన బ్యాటరీ కల్గిన డివైజ్లను వినియోగదారులకు శాంసంగ్ ఆఫర్ చేసింది. ప్రస్తుతం రీకాల్ చేసిన గెలాక్సీ నోట్7 ఫోన్లను సురక్షితమైన బ్యాటరీతో శాంసంగ్ మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.
సింగపూర్, అమెరికా వంటి మార్కెట్లలో రీకాల్ ప్రక్రియ నిదానంగా సాగుతుందని, దీనికోసం పునఃప్రారంభాన్ని జాప్యం చేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1 వరకు బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ప్రభావితమైన ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవాలని లేని పక్షంలో రీకాల్ ప్రక్రియ మరింత కష్టతరమవుతుందని కంపెనీ పేర్కొంటోంది. రీకాల్ ప్ర్రక్రియ అనంతరం ప్రభావితమైన మార్కెట్లో మళ్లీ గెలాక్సీ నోట్7 అమ్మకాలు చేపట్టాలని శాంసంగ్ నిర్ణయించింది. కానీ రీకాల్ ప్రక్రియ ఆలస్యం మార్కెట్లోకి పునఃప్రారంభంపై దెబ్బ కొడుతోంది. రీకాల్ ప్రక్రియ అనంతరం కూడా చాలా బ్యాటరీ పేలుళ్ల ఘటనలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి.పలు దేశాల విమానయాన అధికారులు ఇప్పటికే విమనాల్లో ఈ ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. గెలాక్సీ నోట్7 వల్ల వినియోగదారులకు ఏర్పడిన అసౌకర్యానికి శాంసంగ్ సెప్టెంబర్ 25న క్షమాపణ కూడా చెప్పుకుంది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి, సురక్షితమైన ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కంపెనీ చెప్పింది.