శాంసంగ్ డ్యామేజ్ కంట్రోల్ ఆఫర్ అదుర్స్
సియోల్: శాంసంగ్ గెలాక్సీనోట్ 7, 7ఎస్ స్మార్ట్ ఫోన్ వివాదంతో అష్టకష్టాలు పడుతున్న కొరియా మొబైల్ మేకర్ డ్యామేజ్ కంట్రోల్ లో పడింది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకోసం లక్ష రూపాయల భారీ పరిహారం అందిస్తోంది. ఇప్పటికే స్వదేశీ (కొరియా) మార్కెట్లో రీప్లేస్మెంట్ మొదలు పెట్టిన సంస్థ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
సుమారు రూ.60 వేల (880డాలర్లు) విలువ చేసే గెలాక్సీనోట్ 7ఎస్ ను వాపస్ ఇచ్చిన వినియోగదారులకు రూ. 30,000ల విలువచేసే కూపన్ తో పాటు, అదనంగా రూ. 70,000 మొబైల్ క్రెడిట్ అందించనుంది. ఐఫోన్7 , ఎల్జీ జీ 5 లాంటి ఇతర మొబైల్స్ ను ఎంచుకున్న వారికి 30 వేల కూపన్ తో 70 వేల సహాయం అందించనుంది. అలాగే మరో ఖరీదైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఎంచుకున్న వారికి ఫోన్ తో పాటు అదనంగా రూ. 70,000 మొబైల్ క్రెడిట్ అందించనుంది. యూజర్ల భారీ అసౌకర్యాన్ని పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ రూ.100,000 అందుకోవాలనుకుంటే, నవంబర్ 30 వరకు శాంసంగ్ ఫోన్లను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఏడాది చివరకు అందుబాటులో ఉంటుందనీ, అలాగే ఆయా దేశాల ప్రకారం పరిహారం వేర్వేరుగా ఉంటుందని తెలిపింది. దీంతో భారీ నష్టాల నుంచి శాంసంగ్ షేర్లు కోలుకున్నాయి. 2.4 శాతానికి పైగా పుంజుకున్నాయి.
కాగా బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను గ్లోబల్ గా రీకాల్ చేసింది. రీప్లేస్ చేసిన ఫోన్లు కూడా ప్రమాదానికి గురికావడంతో శాశ్వతంగా వీటికి ముగింపు పలికింది. మరోవైపు ఈ రీకాల్ కోసం యూజర్లకు ఫైర్ ప్రూఫ్ బాక్సులు, గ్లౌజులను సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శాంసంగ్ విడుదల చేసిన వీడియో ట్విట్టర్ లో జోకులు పేలిన సంగతి తెలిసిందే.