శాంసంగ్ భారీ డీల్
శాంసంగ్ భారీ డీల్
Published Mon, Nov 14 2016 2:13 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
కనెక్టెడ్ కార్ల ఉత్పత్తిలో వేగవంతంగా పెరుగుతున్న ఆటోమోటివ్ టెక్నాలజీకి చేరువ కావడానికి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఓ అమెరికన్ కంపెనీని సొంతం చేసుకోబోతుంది. అమెరికన్ ఆటో పార్ట్ల తయారీదారి హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 8 బిలియన్ డాలర్లుగా(సుమారు రూ.54,107 కోట్లు) ఉండనున్నట్టు పేర్కొంది. స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న శాంసంగ్, ప్రస్తుతం కనెక్టెడ్ కార్ల రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది.
ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుందని, శాంసంగ్ బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం ముగింపు ధరకు 27.8 శాతం ప్రీమియంగా ఈ డీల్ ఉంది. ఒక్కో షేరుకు 112 డాలర్ల నగదును హర్మాన్కు శాంసంగ్ చెల్లించనుంది. అమెరికాలో లిస్టు అయిన హర్మాన్, కనెక్టెడ్ కారు టెక్నాలజీలో లీడర్గా ఉంది.
ఈ డీల్ శాంసంగ్ విలువలోనే అతిపెద్దదని, గ్లోబల్ మార్కెట్లోని ఆన్లైన్ కనెక్టెడ్ ఆటో టెక్నాలజీలో తనదైన ఉనికిని చాటుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుందని సంస్థ పేర్కొంది. తాము ఆటోమోటివ్ ఫ్లాట్ ఫామ్లో వృద్ధి చెందడానికి శాంసంగ్కు హర్మాన్ ఓ బలమైన పునాదిని వెంటనే ఏర్పరుస్తుందని పేర్కొంది. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్, ఇతర ఇంటర్నెట్ తరహా వినోద ఫీచర్లను జనరల్ మోటార్స్, ఫియట్ క్రిస్లర్ వంటి గ్లోబల్ కారు కంపెనీలకు హర్మాన్ ఉత్పత్తిచేస్తోంది.
Advertisement