శశికళ సీఎం అయ్యే అవకాశాల్లేవా?
శశికళ సీఎం అయ్యే అవకాశాల్లేవా?
Published Wed, Feb 8 2017 2:20 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న శశికళకు ఇంకా ఏమైనా అడ్డంకులున్నాయా? సుమారు వంద మంది వరకు ఎమ్మెల్యేలు ఆమె వెంట ఉన్నట్లుగా ఇప్పటికి తెలుస్తున్నా, ఇంకా అభ్యంతరాలు ఏవైనా వస్తాయా? అవును.. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కొన్ని కంపెనీలలో వాటాలున్నాయి. ఆ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో వ్యాపారం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆమె ముఖ్యమంత్రి అయితే, ఆ కంపెనీలకు లబ్ధి కలిగించాలన్న 'స్వామిభక్తి' అధికారుల్లో సహజంగానే ఉంటుంది కాబట్టి 'ప్రయోజనాల మధ్య వైరుధ్యం' కింద శశికళకు ముఖ్యమంత్రి పదవి అందకుండా పోయే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల వాదన.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 'ట్రంప్ ఎంపైర్'కు దూరం కావాల్సి వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే చిన్నమ్మకు కూడా ఎదురవుతుందని అంటున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు మళ్లీ ఎప్పుడు తన కార్యాలయానికి వచ్చి బాధ్యతలు చేపడతారో ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన వచ్చేసరికల్లా ప్రతిపక్షాలు శశికళ వ్యాపార ప్రయోజనాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ రీటైలింగ్ సంస్థ టాస్మాక్‌కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సరఫరా చేసే మిడాస్ డిస్టిలరీస్‌లో శశికళ ప్రధాన వాటాదారు. ఈ విషయాన్ని పలువురు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కూడా తప్పుపడుతున్నారు. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న పత్రాలు పరిశీలించి ఏ విషయమూ తేలుస్తామని ఒక సంస్థ ప్రతినిధి వెంకటేశన్ చెప్పారు.
2003లో స్థాపించిన మిడాస్ సంస్థకు 2009-11 సంవత్సరాల మధ్య రూ. 360 కోట్ల టర్నోవర్ ఉంది. కానీ ఒక్కసారిగా 2014-15 నాటికి ఆ సంస్థ టర్నోవర్ రూ. 1400 కోట్లకు పెరిగిపోయింది. జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాతకు, అంతకంటే ముందు నాటికి ఈ సంస్థ వ్యాపారంలో అనూహ్య వృద్ధి కనిపించడాన్నే అనుమానంగా చూస్తున్నారు. అమ్మచాటు చిన్నమ్మగా ఉన్నప్పుడే వ్యాపారాలు ఇలా ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవే తరహా ప్రశ్నలను కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా లేవనెత్తుతున్నారు. శశికళపై కొన్ని సీరియస్ కేసులు ఉన్నాయని, ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారని, అలాంటప్పుడు అది ప్రత్యక్షంగానే ప్రయోజన వైరుధ్యం అవుతుందని ఆయన చెప్పారు.
పైగా ఇటీవలే శశికళ సన్నిహిత బంధువు ఒకరు 'జాజ్ సినిమాస్' సంస్థను టేకోవర్ చేశారని, దాంతోపాటు ఈ వ్యక్తి అనేక వెంచర్లలో ఉన్నారని, ఇదే కాక.. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అద్దెకు ఇస్తూ ఉన్న వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారన్న విషయం మీద కూడా దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష డీఎంకే వాదిస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టినా.. మరో నాలుగైదు రోజుల్లో జయలలిత ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ కేసులో శశికళ ఎ2గా ఉన్నారు. దాంట్లో శిక్ష పడితే మాత్రం.. ఇక ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి మీద ఆశలను ఆమె వదులుకోవాల్సిందే.
Advertisement
Advertisement