సెల్వం సౌమ్యుడే కాదు.. సునామీ కూడా!
చెన్నై: ఒక్క బాంబులాంటి విషయంతో నెట్టింట్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు విధేయుడు, సౌమ్యుడు అయిన పన్నీర్ సెల్వం రాత్రికి రాత్రి తమిళనాడులో మెరీనా బీచ్ వద్ద రాజకీయ సునామీ సృష్టించి హీరో అయ్యారు. సాధారణంగా అతితక్కువ మాత్రమే మాట్లాడే ఆయన, గత రాత్రి మెరీనా బీచ్‌లోని అమ్మ (జయలలిత) సమాధి వద్ద ఓ 40 నిమిషాలపాటు కూర్చుని అనంతరం ప్రెస్ మీట్ పెట్టి నెటిజన్ల నోట జేజేలు పలికించుకుంటున్నారు.
తనను శశికళ ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని, పార్టీ సీనియర్లంతా తనను అవమానించారని, నిజాలు చెప్పి పార్టీని, ప్రజలను కాపాడాలని అమ్మ ఆత్మ తనతో చెప్పడంతో తాను ఆ విషయం చెప్పకుండా ఉండలేకపోయానని చెప్పి అనూహ్యంగా బాంబు పేల్చారు. ఇప్పటికే శశికళపై తమిళనాడు వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండటం, అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉండటంతో అసలు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడమే గగనం అవుతున్న పరిస్థితుల్లో పన్నీర్ కొట్టిన తాజా దెబ్బకు శశికళ దిమ్మతిరిగినట్లయింది.
దీంతో అంతకుముందు శశికళను వ్యతిరేకించిన నెటిజన్లంతా ఇప్పుడు పన్నీర్ సెల్వాలని జై కొడుతున్నారు. ఇప్పటికైనా చాలా ధైర్యంగా నిజాలు చెప్పినందుకు అభినందనలంటూ డీఎంకే ఎమ్మెల్యే జే అంబజగన్ ట్వీట్ చేశారు. అలాగే ఏఐఏడీఎంకే ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ కూడా తాను పన్నీర్ వెంటేనంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనను పదవి నుంచి తీసేసినా పన్నీర్‌తో ఉంటానని చెప్పారు. అమ్మ తమతోనే ఉందని, అమ్మను అభిమానించే, గౌరవించే ఎంపీలు, ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని ట్వీట్ చేసి ఆకర్షించారు. అలాగే ఓ రాజ్యసభ ఎంపీ కూడా సెల్వానికి మద్దతిచ్చారు.
అలాగే, 200మంది పార్టీ కార్యకర్తలు సెల్వం ఇంటిముందుకెళ్లి అన్నాదురై గీతాలు ఆలపించడం మొదలుపెట్టారు. ఇక నెటిజన్లయితే, శశికళ కుటుంబం చేతికి తమిళ పాలన పగ్గాలు పోవడాన్ని తాము అస్సలు ఊహించలేకపోతున్నామని, సెల్వం అయితే, అందరినీ కలుపుకుకొని పోయే స్వభావం ఉన్నందున ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే బావుంటుందని అంటున్నారు. ఏదేమైనా తాను మాట్లాడను.. మాట్లాడితే మిగితా వాళ్లంతా తన మాటలే వింటారు అన్నంతగా ఇప్పుడు తమిళనాడు అతి పెద్ద చర్చకు సెల్వం తెరలేపారు