- జైలు మార్చే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బెంగళూరు నుంచి చెన్నై జైలుకు మారాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమెను చెన్నై పజల్ సెంట్రల్ జైలుకు మార్చాలని ఆమె న్యాయవాదులు కర్ణాటక ప్రభుత్వానికి పిటిషన్ దాఖలుచేశారు. శశికళను చెన్నై జైలుకు తరలించాలనే విషయంపై అన్నాడీఎంకే నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. చట్టబద్ధంగా శశికళను చెన్నై జైలుకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వారు పేర్కొంటున్నారు.
ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు ఆమె బంధువులైన ఇళవరసి, వీఎన్ సుధాకరన్‌లను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమెను తరలించాలంటే ఆమె న్యాయవాదులు మొదట జైలు సూపరింటెండెంట్, కర్ణాటక న్యాయశాఖ మంత్రిని సంప్రదించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తమ అభ్యర్థనను రెండు రాష్ట్రాలు ఒప్పుకొంటే శశికళ తరలింపు సాధ్యమేనని ఆమె లాయర్లు చెప్తున్నారు.
మరోవైపు శశికళ న్యాయవాదుల అభ్యర్థనపై లీగల్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్టు కర్ణాటక న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది అసాధారణ కేసు కాబట్టి చట్టబద్ధంగా వీలైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. న్యాయనిపుణులు మాత్రం శశికళను చెన్నై జైలుకు మార్చే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నారు. 'శశికళ కేసు భిన్నమైనది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆమె కర్ణాటక జైలులో ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప ఆమెను మరో జైలుకు మార్చడం కుదరదు. సుప్రీంకోర్టుకు తెలియజేయకుంటే జైలు మార్పు ప్రక్రియ చేపడితే.. దీనిని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశముంది' అని అక్రమాస్తుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య తెలిపారు.