శశికళ ఎవరు?
- రాజ్యాంగేతర శక్తిగా జయలలిత నెచ్చెలి!
- అన్నాడీఎంకే శ్రేణుల్లో, ప్రజల్లో అసంతృప్తి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జయలలిత నెచ్చెలి శశకళ అన్నాడీఎంకే అధికార కేంద్రంగా అవతరించడంతో తమిళనాడులో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది.
జయలలిత అంత్యక్రియలు పూర్తైన రెండు రోజల తర్వాత (డిసెంబర్ 8) నుంచి సీఎం ఓ పన్నీర్‌సెల్వం, 31 మంది మంత్రులు ప్రతిరోజూ పోయెస్ గార్డెన్‌కు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు జయలలిత నివాసమున్న పోయెస్ గార్డెన్‌లోని ’వేదనిలయం’ లో ఆమె సన్నిహితురాలు శశికళ నివాసముంటున్నారు. పరిపాలన విషయంలో శశికళ నుంచి ఆదేశాలు, సూచనలు, సలహాలు తీసుకొనేందుకే ప్రతిరోజూ సీఎం సహా మంత్రులు పోయెస్ గార్డెన్‌కు వస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 10న అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాల్సిందిగా శశికళను సీఎం పన్నీర్‌సెల్వం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కోరిన సంగతి తెలిసిందే. శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకే సభ్యురాలి మాత్రమే. ఇప్పటివరకు ఆమె ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులే కాదు సీనియర్ అధికారులు సైతం నిత్యం పోయెస్ గార్డెన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తమిళనాడు డీజీపీ టీకే రాజేంద్రన్, ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు కూడా పోయెస్ గార్డెన్‌ను సందర్శించారు. అయితే, వారు శశికళతో ఏం మాట్లాడింది బయటకు తెలియరాలేదు.
అన్నాడీఎంకే నేతలంతా ఇలా చిన్నమ్మ (శశికళ)కు మోకరిల్లుతూ.. ఆమెను అధికార కేంద్రంగా మార్చడంపై పార్టీ కార్యకర్తలు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘నేను అమ్మ (జయలలిత)కు ఓటేశాను. ఆమెనే నా ముఖ్యమంత్రి. మధ్యలో వీరంతా (శశికళ, ఆమె కుటుంబసభ్యులు) ఎవరు? ఇలాగే కొనసాగితే మరోసారి అన్నాడీఎంకేకు ఓటువేయను’ అంటూ మనపక్కంకు చెందిన 35 ఏళ్ల రాజు మాసిలమణి మీడియాతో అన్నారు. చెన్నైకి వెన్నెల బాలమురుగన్ అనే యువతి కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేసింది. ‘నేను ఓటరును. నా నాయకుడిని ఎన్నుకునే హక్కు నాకు ఉంటుంది. నేను శశికళను నాయకురాలిగా ఒప్పుకోను. ప్రశ్నించడానికి నేను ఎందుకు భయపడాలి? ఆమె ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలి ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అన్నాడీఎంకేలోని కిందిస్థాయి నేతలు, శ్రేణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టడానికి శశికళ ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పార్టీని కాపాడాల్సిన పరిస్థితి ఉండటంతో చాలామంది కొంతకాలం వేచిచూసే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు చెప్తున్నారు.
మరోవైపు రాజకీయ పరిశీలకులు కూడా రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. శశికళ రాజ్యాంగయేతర శక్తిగా మారుతున్నారని, ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వంలో సోనియాగాంధీ తరహాలో ఇప్పుడు శశికళ వ్యవహరించాలనుకుంటున్నారని, పన్నీర్‌సెల్వంను ముందుపెట్టి ఆమె తెరవెనుక పాలన సాగించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందని వారు అంటున్నారు. కొత్తగా నియమితులైన సీఎంకు మాజీ సీఎం నెచ్చెలితో భేటీ కావాల్సిన అవసరమేముంది? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు సీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకేలో శశికళ తీరుపై వ్యతిరేకత, అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు.