ఈ తీర్పు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సహ నిందితులైన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ వారికి నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ప్రధాన నిందితులైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత కూడా కేసును కొట్టివేయకుండా, కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించి సబబని తీర్పు చెప్పడం సుప్రీంకోర్టు చెబుతున్న కొత్త భాష్యంగా పరిగణించవచ్చు.
పదవిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే శిక్షించేందుకు అవినీతి నిరోధక చట్టం వచ్చిందన్నది ప్రధాన వాదన. కేసులో ప్రధాన నిందితుడిని శిక్షించడమే చట్టం ప్రధాన లక్ష్యం. ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తే మరణించినట్లయితే, అతన్ని లేదా ఆమెను శిక్షించడం సాధ్యం కాదన్న కారణంగా గతంలో కొన్ని కేసులను కొట్టివేశారు. ప్రధాన నిందితులనే శిక్షించలేనప్పుడు ఇక సహ నిందితులను ఎలా విచారించి శిక్షిస్తామంటూ సహ నిందితులును ఆయా కేసుల్లో విముక్తులను చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జయలలిత మరణించినందున సహ నిందితులపై కేసు నిలబడదని, అందుకని సహ నిందితులుగా ఉన్న శశికళ కూడా విడుదలవుతారని కొంత మంది న్యాయనిపుణులు భావిస్తు వచ్చారు. వారి అభిప్రాయం మేరకు శశికళ వర్గం ఆశాభావంతో ఇంతకాలం ఉన్నారు. గతంలో ప్రధాన నిందితులు చనిపోయినప్పుడు కేసులు కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయిగానీ, ట్రయల్ కోర్టులు దోషులను నిర్ధారించక ముందే ప్రధాన నిందితులు మరణించిన సందర్భాలకు సంబంధించిన కేసులవి.
జయలలిత కేసులో ట్రయల్ కోర్టు దోషులను నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. నేడు సుప్రీం కోర్టు కూడా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనంటూ సంక్షిప్తంగా తీర్పు చెప్పింది. దీనర్థం జయలలితతోపాటు సహ నిందితులు అందరూ దోషులేనని తీర్పు చెప్పడం. జయలలిత చనిపోయినందున ఆమెకు తీర్పు వర్తించదని, ఆమెకు వర్తించనప్పుడు సహ నిందితులకు ఎలా వర్తిస్తుంది అన్న అంశానికి ఎలాంటి భాష్యం చెప్పిందో సుప్రీం కోర్టు పూర్తి తీర్పు పాఠం వెలువడితేగానీ చెప్పలేం. ఒకవేళ ట్రయల్ కోర్టు జయతో సహ నిందితులను దోషులుగా తేల్చకపోయి ఉంటే జయలలిత చనిపోయిందన్న కారణంగా సుప్రీం కోర్టు ఈ పాటికి కేసును కొట్టివేసి ఉండేదేమో!