జైలులో ‘వీఐపీ’ శశికళ, ఐపీఎస్ అధికారిణి రూప(ఫైల్)
- ‘జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్’పై ఐపీఎస్ రూప వ్యాఖ్య
- ఏకసభ్య విచారణలోనూ ఆధారాలు లభ్యం.. నేడో,రేపో ప్రభుత్వానికి నివేదిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు అధికారులకు లంచం ఇచ్చి, లగ్జరీ జీవితం అనుభవించినట్లు రుజువైన పక్షంలో అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళకు మరికొన్నేళ్లు అదనపు శిక్ష పడే అవకాశం ఉందని జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప చెప్పారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శశికళ, నకిలీ స్టాంపుల కేసులో అరెస్టయిన అబ్దుల్ కరీం తెల్గి తదితరులు ఖరీదైన సౌకర్యాలను కల్పించుకుని దర్జా జీవితాన్ని గడుపుతున్నట్లు రూప బయటపెట్టారు.
ముఖ్యంగా శశికళ రూ.2 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరదీశారు రూప. కాగా, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ సత్యనారాయణరావును కర్ణాటక ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. అదే సమయంలో రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది.
ఐపీఎస్ అధికారిణి రూప ఇటీవలే ఓ తమిళ పత్రిక (తమిళ్ మురసు) కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శశికళకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ‘జైలులో ఆమె అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు ఆధారాలు సేకరించాను... అసలు ఆమె జైలులోనే గడపకుండా సమీపంలోని ఒక క్వార్టరులో ఉండేవారని కూడా తెలుసుకున్నాను. ఈ విషయంలో ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఉంటే చాలా తీవ్రమైన చర్య తీసుకుని ఉండేదాన్ని. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో రాజభోనాలు అనుభవిచినట్లు రుజువైన పక్షంలో ఆమెకు మరో ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది’అని రూప చెప్పారు.
ఇదిలా ఉండగా, రూప చేసిన ఆరోపణలపై విచారణకుగానూ కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు అధికారి వినయ్‌కుమార్‌ను నియమించింది. హవాలా రూపంలో జైలు అధికారులకు రూ.2 కోట్లు అందాయనడానికి వినయ్‌కుమార్‌కు ఆధారాలు లభించినట్లు, ఈనెల 24వ తేదీన ఆయన తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.