శశికళకు ఎన్ని వసతులో!
బెంగళూరు : తమిళనాడు అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి ఒక్కొక్క విషయమే బయటికి వస్తోంది. తాజాగా సోమవారం ఆమెకు ఒక బ్యారెక్‌లోని మూడు– నాలుగు సెల్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక సెల్ కిచెన్‌గా, రెండో సెల్‌లో దుస్తులు, కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంచుకోవడానికి కప్‌బోర్డులు కూడా ఉన్నాయి. ఇక మరో సెల్‌లో విజిటర్స్‌ను కలవడానికి కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. మరోసెల్‌లో శశికళ నిద్రించడానికి వినియోగించేవారని సమాచారం. ఫ్యాన్, మస్కిటో కాయిల్స్ కూడా ఆమెకు కేటాయించినట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా సెల్స్ ఉన్న బ్యారెక్‌లోకి ఎవరినీ పంపించేవారు కాదని ఇక సెల్స్‌కు తెర కూడా ఉండేదని దీని వల్ల లోపల ఉన్నవారు ఏమి చేస్తున్నారో బయటికి తెలిసేది కాదని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు సమాచారం లీకేజీ చేస్తున్నారనే అనుమానంతో జైలులో ఉన్న దాదాపు 40 మంది ఖైదీలను వేర్వేరు జైళ్లకు పంపిచేశారు.
కాగా తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం, ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది.