సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళకు కొత్త చిక్కులు తప్పవేమో అన్న ఆందోళన బయలు దేరింది. ఆమె విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మ శిబిరాన్ని కలవరంలో పెట్టే సమాచారం తాజాగా వెలువడడమే ఇందుకు కారణం. గతంలో జైలులో చిన్నమ్మ లగ్జరీ జీవితం గుట్టును రట్టు చేసిన ఐపీఎస్ అధికారి రూప తాజాగా ఆ రాష్ట్ర హోంశాక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ పరిణామం చిన్నమ్మ విడుదల మీద పడేనా అన్న ఉత్కంఠ ఆమె శిబిరంలో కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహారం జైలులో ఉన్న విషయం తెలిసిందే. 2017 ఫిబ్రవరిలో జైలుకు చిన్నమ్మ వెళ్లారు. ఇప్పటికి రెండుసార్లు పెరోల్‌పై ఆమె బయటకు వచ్చారు. ఆ తదుపరి జైలుకే పరిమితం అయ్యారు. (త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం)
ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా చిన్నమ్మ ముందస్తుగా విడుదల కాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వస్తున్నాయి. చిన్నమ్మ కోసం పోయేస్ గార్డెన్‌లో ఓ బంగ్లా సైతం రూపుదిద్దుకుంటోంది. త్వరలో చిన్నమ్మ బయటకు రావడమే ఖాయం అన్న ధీమాతో ఉన్న ఆమెప్రతినిధి దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలకు తాజాగా పెద్ద షాకే తగిలింది. ముందస్తు విడుదల మాట పక్కన పెట్టి, అస్సలు ఇప్పట్లో ఆమె బయటకు వచ్చేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం గతంలో ఆమె మీద తీవ్ర ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి రూప కర్ణాటక హోంశాఖ కార్యదర్శిగా నియమితులు కావడమే. (శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!)
తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా 2017 చివర్లో తీవ్రచర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా అప్పట్లో పనిచేసిన రూప స్వయంగా ఈ లగ్జరీ వివరాలను బయట పెట్టడం , ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ లగ్జరీ వ్యవహారం మీద రిటైర్డ్ ఐఏఎస్ వినయ్‌కుమార్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరిపి నివేదికను కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో రూప తరపు అనేక ఆధారాలు సమర్పించి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
అదే సమయంలో లగ్జరీ ఆరోపణల తదుపరి రూపకు బదిలీలు, శాఖల మార్పు అంటూ చిక్కులు తప్పలేదు. ప్రస్తుతం బెంగళూరు డివిజన్ రైల్వే ఐజీగా ఉన్న ఆమెను హోంశాఖ కార్యదర్శిగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. దీంతో చిన్నమ్మ లగ్జరీ వ్యవహారం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నమ్మ విడుదలకు ముందుగా రూప కీలక పదవిలోకి వచ్చి ఉండటంతో తెర మరుగున పడి ఉన్న లగ్జరీ విచారణ నివేదికను తవ్వే అవకాశాలు ఉన్నాయని, ఈ దృష్ట్యా, చిన్నమ్మ విడుదలకు చిక్కులు తప్పదేమో అన్న చర్చ తెర మీకు వచ్చింది. ఈ వ్యవహారం అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసింది. అదే సమయంలో చిన్నమ్మ విడుదల విషయంగా ముందుగా న్యాయ నిపుణులతో చర్చించి, రూప రూపంలో చిక్కులు ఎదురు కాకుండా అమ్మ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది
Comments
Please login to add a commentAdd a comment