సౌదీ రాజా.. మజాకా!! | Saudi king Salman bin Abdul Aziz al-Saud trip to Indonesia: taking heavy luggage | Sakshi
Sakshi News home page

సౌదీ రాజా.. మజాకా!!

Published Tue, Feb 28 2017 10:55 PM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

సౌదీ రాజా.. మజాకా!! - Sakshi

సౌదీ రాజా.. మజాకా!!

ఎవరైనా దేశాధినేతలు వస్తున్నారంటే ఆతిథ్యదేశం వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గురించి తెలిసిందే. అయితే కొందరు దేశాధినేతల రూటే సెపరేటు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్లినా.. తమ ఏర్పాట్లు తామే స్వయంగా చేసుకుంటారు. ఆ ఏర్పాట్లు కూడా అలా ఇలా ఉండవు... మనం ఊహించని రీతిలో, నోరెళ్లబెట్టే స్థాయిలో ఉంటాయి. ఇలాంటివారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సౌదీ రాజు గురించి.

సౌదీ రాజకుటుంబం అంటేనే విలాసాలకు పెట్టింది పేరు. అలాంటి కుటుంబం ఇప్పుడు ఇండోనేషియా పర్యటనకు వెళ్తోంది. ప్రపంచలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో సౌదీ రాజు పర్యటిస్తుండడంతో ఇప్పుడు మీడియా దృష్టి అంతా సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ వైపే మళ్లింది ఎందుకంటే... ఇతర దేశాధినేతల్లాగా సాదాసీదాగా వెళ్లడం ఆయనకు తెలియదు. హంగు ఆర్భాటాలు జోరుగా ఉండాల్సిందే.

పర్యటన కోసం తీసుకెళ్తున్నవి...

  • మొత్తం లగేజీ బరువు 459 మెట్రిక్‌ టన్నులు
  • రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌600 లీమోసిన్స్‌
  • ప్రత్యేకంగా రూపొందించిన రెండు విద్యుత్తు ఎలివేటర్లు
  • రాజకుంబానికి సపర్యల కోసం 572 మంది పనివాళ్లు
  • ఇక రాజు వెంట వెళ్తున్న మొత్తం మంది 1500 పైమాటే
  • 10మంది మంత్రులు, 25 మంది రాకుమారులు, 100 సెక్యూరిటీ సిబ్బంది


అమెరికా, ఫ్రాన్స్‌ పర్యటనలకూ అంతే..
ఇండోనేషియాలాంటి పేద దేశంలో పర్యటిస్తున్నప్పుడే కాదు.. గతంలో అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు కూడా అంతే. 2015లో సౌదీ రాజు వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ జార్జ్‌టౌన్‌లోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు. అమెరికాలోనే అత్యంత విలాసవంతమైన హోటళ్లలో అది కూడా ఒకటి. అదే ఏడాది సౌదీ రాజు ఫ్రాన్స్‌ పర్యటన విమర్శలకు తావిచ్చింది. ఆయన అక్కడకు 1,000 మంది సిబ్బందిని వెంటేసుకొని వెళ్లాడు. వారు తీరంలోని ది ఫ్రెంచ్‌ రివేరా ప్రాంతంలో బస చేశారు. అక్కడ ఇసుకలో అనుమతిలేకుండా కాంక్రీట్‌తో నిర్మాణాలు చేపట్టినట్లు స్థానిక మేయర్‌ ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు.

బరాక్‌ ఒబామా తక్కువేమీ కాదు..: ప్రపంచ నేతల విషయానికొస్తే.. 2013లో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆఫ్రికా పర్యటన కూడా భారీగానే సాగింది. అక్కడకు ఆయన దాదాపు 56 వాహనాలను తీసుకెళ్లారు. వీటిల్లో 14 లీమోసిన్స్‌ ఉన్నాయి. వందల మంది సీక్రెట్‌ సర్వీసు సిబ్బంది కూడా ఈ పర్యటనలో ఆయన వెంట ఉన్నారు.

–సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement