జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
Published Mon, Dec 26 2016 1:20 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
ముంబాయి : కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త కార్లు, ఇళ్లు కొనుకోవాలనుకునే వారు శుభవార్త వినిబోతున్నారట. 2017 మొదటినెలలోనే ప్రముఖ అగ్రగామి బ్యాంకులన్నీ వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. ఈ రేట్లు తగ్గించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం ఏర్పడిన నగదు కొరతకు వినియోగత్వం దెబ్బతిన్నది. నిత్యావసరం కాని వస్తువుల కొనుగోళ్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో వినియోగత్వాన్ని పెంచడానికి బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి చౌకైన వడ్డీరేట్లు లభించనున్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బీఐ స్పందించడం లేదు.
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకి భారీ మొత్తంలో డిపాజిట్లు సమకూరాయి. బ్యాంకుల లిక్విడిటీ కూడా భారీగా పెరిగింది. గతవారం ఇండియన్ బ్యాంకు అసోసియేషన్తో భేటీ అయిన బ్యాంకులు వడ్డీరేట్ల కోత విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. దేశీయ అగ్రగామి బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమయ్యే మార్గాలను వారు చర్చించారని, ఆర్థికమంత్రిత్వశాఖతో కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించే విషయంపై చర్చించారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్తో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్ను పునరుద్ధరించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. మరోవైపు డిసెంబర్ 30 తర్వాత కూడా నగదు విత్డ్రాలపై విధించిన పరిమితులు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.
Advertisement
Advertisement